జగనన్న తోడు.. చిరు వ్యాపారులకు ఆ కష్టం రావొద్దనే ఈ పథకం: సీఎం జగన్‌ స్పష్టీకరణ

11 Jan, 2023 14:44 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: చిరు వ్యాపారులు వాళ్ల కష్టంపైనే ఆధారపడతారని, అందుకే వాళ్లకు అండగా నిలిచామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో జగనన్న తోడు పథకంలో భాగంగా.. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణాల నగదు జమ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

చిరు వ్యాపారులు వారి కష్టంపైనే ఆధారపడతారు. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడికి భరోసా కల్పిస్తున్నాం. చిరు వ్యాపారుల జీవనోపాధికి అండగా జగనన్న తోడు పథకం నిలుస్తోంది. ఒక్కో వ్యాపారికి ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ.10వేల వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నాం. కొత్తగా 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు కొత్తగా రూ.395 కోట్ల రుణాలు అందిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. 

ఇప్పటిదాకా 15,31,347 మందికి.. రూ.2,406 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు వివరించారాయన. గత ఆరు నెలలకు సంబంధించి రూ.15.17 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారని ఉద్ఘాటించారాయన.

 ‘‘పాదయాత్రలో.. తోపుడు బండ్ల వ్యాపారుల కష్టాలు చూశాను. వాళ్లు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారు. అందుకే వాళ్ల పెట్టుబడి కష్టం కావొద్దనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చాం. లబ్ధీదారుల పూర్తి వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో ఈరోజే ఈ వడ్డీని జమ చేస్తున్నాం’’ అని సీఎం జగన్‌ వెల్లడించారు. అర్హత ఉండి కూడా పథకం అందుకోని వారు ఉంటే.. వారికి కూడా లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు సీఎం జగన్‌.

ఏపీలో చిరువ్యాపారులకు సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. పెట్టుబడి రుణంతో అండగా నిలుస్తూ.. ఆర్థికంగా వాళ్లు నిలదొక్కుకునేందుకు జగనన్న తోడు పథకం ఎంతగానో ఆసరాగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆరో విడుత నగదును సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి జమ చేశారు. అంతకు ముందు పలువురు చిరువ్యాపారులు ఈ పథకం వల్ల తాము ఎలా బాగుపడ్డామనేది వివరించగా.. సీఎం జగన్‌ సంతోషించారు. 

ఇక ఈ కార్యక్రమంలో సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత నాలుగేళ్లలో సీఎం జగన్‌ ప్రభుత్వం.. చిరువ్యాపారులకు జగనన్న తోడు పథకం ద్వారా ఎలా అండగా నిలబడిందనేది ఈ సందర్భంగా వాళ్లు సీఎం జగన్‌కు వివరించారు. వివిధ జిల్లాల కలెక్టరేట్ల నుంచి కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఇతర ఉన్నతాధికారులు, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ (ఏపీ) నవనీత్‌ కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరు అయ్యారు.

మరిన్ని వార్తలు