నేడు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న వసతి దీవెన నగదు 

28 Apr, 2021 03:23 IST|Sakshi

కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని గట్టిగా విశ్వసిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న వసతి దీవెన పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బుధవారం రూ.1,048.94 కోట్లను జమ చేయనున్నారు. 2020–2021 సంవత్సరానికి మొత్తం 10,89,302 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా సీఎం నగదు జమ చేస్తారు. దీనికనుగుణంగా బడ్జెట్‌ను విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి కోవిడ్‌ కల్లోలంలోనూ దాన్ని తూచా తప్పకుండా సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థుల బంగారు భవితే లక్ష్యంగా గత వారం జగనన్న విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మొదటి త్రైమాసికం కింద రూ.671.45 కోట్లు వారి తల్లుల ఖాతాలకు సీఎం జమ చేశారు. ఇప్పుడు వసతి, భోజన ఖర్చులకు రూ.1,048.94 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.  

దేశంలో ఎక్కడా లేని విధంగా..  
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు చొప్పున, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేల చొప్పున, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చులను చెల్లించేందుకు జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి సీఎం రూపకల్పన చేశారు. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఇప్పటికే రూ.1,220.99 కోట్లను చెల్లించారు. బుధవారం మొదటి విడతగా రూ.1,048.94 కోట్లను చెల్లిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన కింద రూ.2,269.93 కోట్లు చెల్లించినట్లు అవుతుంది.    

మరిన్ని వార్తలు