పేదరికంతో చదువులు ఆగిపోకూడదు.. అందరినీ చదివించండి: సీఎం జగన్‌

8 Apr, 2022 13:14 IST|Sakshi

సాక్షి, నంద్యాల: పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అసలైన ఆస్తి చదువేనని, పేదరికం కారణంతో చదువులు ఎట్టిపరిస్థితుల్లో ఆగిపోకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల జిల్లాలో జగనన్న వసతి దీవెన రెండో విడత నిధుల విడుదల కార్యక్రమ సభలో విద్యార్థులు, తల్లులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 
 
పరిపాలన సంస్కరణలో భాగంగా ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లాగా చేస్తానని, సుపరి పాలనను ప్రజలకు చేరవేస్తానని నంద్యాలలోనే మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు మళ్లీ మీ వాడిగా వచ్చానంటూ భావోద్వేగంగా ప్రసంగించారు సీఎం జగన్‌. పిల్లలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి.. చదువు. ఆ చదువు కోసం తల్లిదండ్రులకు అండగా ఉంటున్నాం. ఇంట్లో ఎంత మంది ఉన్నా పర్వాలేదు.. అందరినీ చదివించండి. తోడుగా మన ప్రభుత్వం ఉందని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు సీఎం వైఎస్‌ జగన్‌.  

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. పేదరికం కారణంగా చదువులు ఆగిపోకూడదు. చదువు అనే ఆస్తి ఇవ్వకుంటే పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటకు రాలేవు. ఆ బాధ్యతను కుటుంబ పెద్దగా తాను తీసుకున్నానని, జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లలు, తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని తెలిపారు. చదువును తల్లిదండ్రులు ఆర్థిక భారంగా భావించకూడదనేది ఈ పథకం మరో ఉద్దేశమని తెలిపారు.

చదువు కోసం దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ ఇస్తే.. జగన్‌ అనే నేను ఆయన వారసుడిగా రెండు అడుగులు వేస్తున్నానని చెప్పారు. గత ప్రభుత్వం నీరుగారిస్తే.. తమ ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకం ద్వారా మరింత మెరుగులు దిద్దామని తెలిపారు. తల్లులకు ప్రశ్నించే హక్కు వస్తుందని.. కాలేజీల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు సీఎం జగన్‌. 

విద్యాసంస్థల్లో వసతులు సైతం మెరుగుపడతాయని, బాగోలేకపోతే ప్రభుత్వం దృష్టికి ఆ తల్లులు తీసుకురావొచ్చని, అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. చదువుతో పాటు మంచి భోజనాన్ని సైతం పిల్లలకు అందించడం గర్వంగా ఉందని సీఎం జగన్‌ అన్నారు. బైలింగువల్‌ బుక్స్‌ ద్వారా క్రమక్రమంగా ఆంగ్ల మాధ్యమం వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నామని తెలిపారు సీఎం జగన్‌. తల్లులు బాగుంటేనే.. పిల్లలూ బాగుంటారన్న ఉద్దేశంతో ఖర్చుకు కూడా వెనకాడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారాయన.

మరిన్ని వార్తలు