ఫీజులపై ఒత్తిడి చేయొద్దు

7 Nov, 2020 04:10 IST|Sakshi

‘జగనన్న విద్యా దీవెన’ మార్గదర్శకాలు జారీ

సాక్షి, అమరావతి: ‘జగనన్న విద్యా దీవెన’ పథకం ద్వారా ఫీజుల చెల్లింపుల విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం ద్వారా నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను ప్రభుత్వం జమ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఫీజుల డబ్బుల కోసం ప్రవేశాల సమయంలో విద్యార్థులను ఒత్తిడి చేయవద్దని, కళాశాలల్లో తల్లిదండ్రులు పరిశీలించిన సౌకర్యాలను విద్యార్థి చదువు పూర్తయ్యే వరకు యథాతథంగా కొనసాగించాలని యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది. 

కాలేజీలకు విద్యార్థుల తల్లిదండ్రులు..
నాలుగు త్రైమాసికాలలో ప్రభుత్వం ఇచ్చే ఫీజుల డబ్బులను విద్యార్థి తల్లి కళాశాలలకు చెల్లిస్తుంది. తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతోందా? లేదా? అనే విషయాన్ని పరిశీలించేందుకు తల్లులు తరచూ కాలేజీని సందర్శిస్తారు. విద్యార్థి ఎలా చదువుతున్నాడో తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ప్రతి త్రైమాసికంలో కళాశాలను సందర్శించాలి. ప్రభుత్వం విద్యార్థి తల్లి ఖాతాకు ఫీజుల డబ్బులు విడుదల చేసిన వారం రోజుల్లో కాలేజీల్లో చెల్లించాలి. అలా కాలేజీలో చెల్లించకుంటే ప్రభుత్వం బాధ్యత వహించదు. తదుపరి విద్యార్థికి జగనన్న విద్యా దీవెన పథకం కింద డబ్బులు నిలిపివేస్తారు. 

సౌకర్యాలు లేకుంటే ఫిర్యాదు చేయవచ్చు..
కాలేజీలో సౌకర్యాలు సరిగా లేవని భావిస్తే జ్ఞానభూమి పోర్టల్‌లో విద్యార్థి లాగిన్‌ ద్వారా తల్లులు ఫిర్యాదు చేయవచ్చు. లేదా స్పందన పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. లేదా 1902కి కాల్‌ చేసి తెలియ చేయవచ్చు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. తల్లుల ఖాతాలకు జగనన్న వసతి దీవెన డబ్బులు విడుదల చేసిన వెంటనే వసతి ఖర్చుల కోసం చెల్లించాలి. 

మరిన్ని వార్తలు