Jagananna Vidya Kanuka: రూ.789 కోట్లతో 48 లక్షలమంది పిల్లలకు ‘కానుక’

27 Aug, 2021 02:28 IST|Sakshi

ప్రభుత్వ పాఠశాలల్లో చేరే ప్రతి ఒక్కరికీ జగనన్న విద్యాకానుక

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికీ ‘జగనన్న విద్యాకానుక’ అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి అదనంగా అయ్యే ఖర్చుకు తగిన నిధులను వెచ్చిస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతుండడంతో అందుకనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021–22 విద్యాసంవత్సరానికి జగనన్న విద్యాకానుక పథకం కింద అందించే స్టూడెంట్‌ కిట్లకోసం రూ.731.30 కోట్లు వ్యయం కావచ్చని ముందు అంచనా వేశారు. కానీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో తాజాగా మరో రూ.57.92 కోట్లు అదనంగా కేటాయించారు. ఈ విద్యాసంవత్సరానికి జగనన్న విద్యాకానుక కిట్లకోసం మొత్తం రూ.789.22 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గత ఏడాది 42.34 లక్షల మందికి ఈ కిట్లు అందించగా ఈ విద్యాసంవత్సరంలో 48 లక్షల మందికిపైగా విద్యార్థులకు అందించనున్నారు. ఈసారి అదనంగా విద్యార్థులకు డిక్షనరీలను కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: డ్రోన్ల ఆపరేషన్‌ సులభతరం

ఈ నెల 31 లోగా పంపిణీ 
ఈనెల 16వ తేదీనుంచి పాఠశాలలు ప్రారంభమైన రోజునే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండో విడత జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీని ప్రారంభించారు. ఆ రోజునుంచే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీ చేపట్టారు. గత సంవత్సరం జగనన్న విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు 3 జతల యూనిఫాం, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, పాఠ్యపుస్తకాలు ఇచ్చారు. ఈ విద్యాసంవత్సరంలో అదనంగా 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ, 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పిక్టోరల్‌ డిక్షనరీలను (బొమ్మల నిఘంటువును) అందిస్తున్నారు. 47,32,064 మంది విద్యార్థులకు వీటిని అందించేలా తొలుత అంచనా వేసినా చేరికలు పెరుగుతుండడంతో ఈ సంఖ్య 48 లక్షలకు పైగా పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. కోవిడ్‌ కారణంగా దశలవారీగా కిట్లను పంపిణీ చేస్తుండటంతో ఇప్పటికి 75 శాతం వరకు విద్యార్థులకు అందాయి. ఈనెల 31వ తేదీలోపు పంపిణీ పూర్తిచేయనున్నారు. చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం

సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త ప్రవేశాల వివరాలతో పాటు విద్యాకానుక కిట్ల వస్తువుల్లో చినిగిన, పాడైన, కొలతలు తేడాలున్న వాటిని పంపిణీ చేయకుండా రిజెక్టు చేసి ఆ వివరాలను రిజిస్టర్లో నమోదు చేసిన అనంతరం స్కూలు హెచ్‌ఎంలు, ఎంఈవోలు ఉన్నతాధికారులకు తెలియజేయాలి. దీనికోసం రాష్ట్ర కార్యాలయంలో జగనన్న విద్యాకానుక గ్రీవెన్సె్సల్ను ఏర్పాటుచేసి రాష్ట్ర అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ను నోడల్‌ అధికారిగా నియమించారు. ఏమైనా ఫిర్యాదులను ‘జేవీకే2గ్రీవెన్స్‌ఎట్‌దరేట్‌జీమెయిల్‌.కామ్‌’కు పంపించేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు నేరుగా సంప్రదించడానికి 0866–2428599 నంబరును ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్సె్సల్‌ ఏర్పాటైంది. స్కూళ్లనుంచి అందిన ఫిర్యాదులు ఇతర అంశాలను సెప్టెంబర్‌ 15లోగా రాష్ట్ర కార్యాలయానికి పంపేలా చర్యలు తీసుకున్నారు. స్టూడెంట్‌ కిట్లు జిల్లాకు సరిపడినన్ని రానిపక్షంలో ఏ సరుకు ఎంతకావాలో రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాలని విద్యాశాఖ సూచించింది. ఈ వస్తువుల జాబితాను ఎప్పటికప్పడు నమోదు చేసేందుకు జగనన్న విద్యాకానుక యాప్‌ను ఏర్పాటుచేశారు.

ఏ వస్తువులు ఎవరెవరికి ఎన్నెన్ని..
జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు వారి తరగతిని అనుసరించి అందిస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 3 జతల యూనిఫాం క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, స్కూలు బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నిఘంటువు (డిక్షనరీ) ఇస్తున్నారు. 1 నుంచి 10 వ తరగతి  బాలురకు, 1 నుంచి 5వ తరగతి బాలికలకు బెల్టు ఇస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వారికి నోటుపుస్తకాలు అందజేస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఆరు, ఏడు తరగతులకు 8, ఎనిమిదో తరగతికి 10, తొమ్మిదో తరగతికి 12, పదో తరగతికి 14 నోటుపుస్తకాలు ఇస్తున్నారు. 

మరిన్ని వార్తలు