క్లీన్‌ ఏలూరుకు ‘క్లాప్‌’

13 May, 2022 20:13 IST|Sakshi
ఏలూరులో చెత్త సేరిస్తున్న సిబ్బంది

ఇంటింటా చెత్త సేకరణ

నగరంలో 65 వేల ఇళ్లకు సేవలు

60 వాహనాలు, 120 మంది సిబ్బంది

సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో యూజర్‌ చార్జీలు 

ఏలూరు టౌన్‌: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలం. వ్యక్తిగత, ఇల్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల నాని ప్రత్యేక శ్రద్ధతో ఏలూరు నగరాన్ని క్లీన్‌గా ఉంచేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లాప్‌ ప్రోగ్రామ్‌ను పక్కాగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి ఇంటికీ మూడు రంగుల చెత్త డబ్బాలు పంపిణీ చేయగా, చెత్త సేకరణకు ప్రత్యేకంగా వాహనాలనూ ఏర్పాటు చేశారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ చెత్తసేకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెత్తసేకరణ చేస్తూ యూజర్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.  

60 వాహనాలు 
ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 60 వేల గృహాల నుంచి చెత్తసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలో సుమారు 79 సచివాలయాల పరిధిలో 60 చెత్త సేకరణ వాహనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో చెత్త సేకరణ వాహనంలో డ్రైవర్, ఒక శానిటరీ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. కార్పొరేషన్‌ పాలక మండలి నగరంలోని గృహాలకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ప్రతి ఇంటికీ మూడు రంగుల డస్ట్‌బిన్స్‌ పంపిణీ చేసింది. ఒక బుట్టలో తడి చెత్త, మరో బుట్టలో పొడి చెత్త, ఇంకో బుట్టలో ప్రమాదకర వ్యర్థాలను వేరుచేసి చెత్త సేకరణ వాహనానికి అందించేలా ప్రణాళిక తయారు చేసి అమలు చేస్తున్నారు.  

యూజర్‌ చార్జీలు తప్పనిసరి 
స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న ఇంటింటా చెత్తసేకరణలో విధిగా యూజర్‌ చార్జీలు వసూలు చేయాల్సిందేనని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు పరిసరాల పరిశుభ్రతకు చెత్త సేకరణ చేస్తూనే ప్రజల నుంచి సేవా పన్ను వసూలు చేయాలని ఆదేశించింది. యూజర్‌ చార్జీలు వసూలు చేయని రాష్ట్రాలకు స్వచ్ఛ భారత్‌ నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది. దీంతో ఏలూరు నగరంలోనూ సేవా పన్ను వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

పారదర్శక సేవలకు చార్జీలు 
ఏలూరు నగరంలో చెత్తసేకరణ సేవలకు చార్జీలు వసూలును అత్యంత పారదర్శకంగా వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్లమ్‌ ఏరియాలో ఒక్కో ఇంటికి నెలకు రూ.60, సాధారణ ప్రాంతాల్లో రూ.100 వసూలు చేస్తుండగా, హాస్పిటల్స్, మాల్స్, పెద్దషాపులు, హోటల్స్, సినిమా థియేటర్లు, కమర్షియల్‌ ఇలా 3500 ప్రాంతాల్లో రోజువారీ చెత్త అధారంగా పన్ను వసూలు చేసేలా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఈ నెల నుంచీ ఈపాస్‌ మిషన్ల ద్వారా చార్జీలు వసూలు చేసేలా చర్యలు తీసుకున్నారు. నగదు, క్రెడిట్, డెబిట్, ఇతర విధానాల్లో చార్జీలు వసూలు చేయటంతోపాటు తప్పనిసరిగా రశీదు అందజేస్తారు.  

నగర ప్రజలు సహకరించాలి 
నగర ప్రజలు సహకరిస్తే రాబోయే కాలంలో క్లీన్‌ ఏలూరుగా చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. నగరంలో సుమారు 60 వేల ఇళ్ల నుంచి నిత్యం చెత్తను సేకరించేందుకు సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి రోజూ ఒక్కో వ్యక్తి ద్వారా అరకేజీ చెత్త తయారవుతుందని ప్రభుత్వ అంచనా. యూజర్‌ చార్జీలను పారదర్శకంగా సేకరించేందుకు ఈపాస్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 
– షేక్‌ నూర్జహాన్, ఏలూరు నగర మేయర్‌  

రోడ్లపై చెత్త, వ్యర్థాలు వేయకండి 
నగరాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. నగరంలోని ప్రజలు చెత్త సేకరణకు సిబ్బందికి సహకరించాలి. రోడ్లపైనా, డ్రెయినేజీల్లోనూ చెత్త, వ్యర్థాలు వేయవద్దు. చెత్త ఒక రోజు మర్చిపోయినా మరుసటి రోజు వరకు వ్యర్థాలను ఇంటివద్దనే ఉంచి చెత్త సేకరణ వాహనాలకు అందించాలి. ఇష్టారాజ్యంగా రోడ్లపై, డ్రెయినేజీల్లో వేయటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. 
– డి.చంద్రశేఖర్, ఏలూరు నగర కమిషనర్‌   

మరిన్ని వార్తలు