జగమంత అండ

5 Jan, 2021 10:21 IST|Sakshi

కరోనా వచ్చింది... ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నెలకు లక్షలు ఖర్చు చేసే వాళ్లు కూడా బ్యాంకు అకౌంట్‌ను భయం భయంగా చూసుకోవాల్సి వచ్చింది. బ్రాండెడ్‌ షర్టు కోసం వేలాది రూపాయల ఖర్చు చేసే వాళ్లు వెయ్యి రూపాయల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. వెయ్యి రూపాయలు చేతిలో ఉంటే వడ్డీ వ్యాపారి ముందు చేయి చాచాల్సిన దుస్థితి ఉండదనే చిరు వ్యాపారి బతుకు దాదాపుగా ఛిద్రమై పోయింది. హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి టోకున కూరగాయలు, పండ్లు కొనుక్కుని కాలనీల్లో అమ్ముకుని రోజుకింత అన్నం తినేవాళ్లకు బతకడమే కష్టమైపోయింది.

వెయ్యి రూపాయలు అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారి పొద్దున తొమ్మిది వందలే ఇస్తాడు. సాయంత్రం వచ్చి వెయ్యి రూపాయలు దండుకుంటాడు. పదివేల అప్పు కోసం చెయ్యి చాస్తే ఇచ్చేది తొమ్మిది వేలే. పండ్లు అమ్మగా వచ్చిన రాబడిలో వడ్డీ వ్యాపారికి చెల్లించాల్సింది చెల్లించుకోగా మిగిలిన దాంతో రోజులు నెట్టుకురావాలి. అధిక వడ్డీ కోరల నుంచి చిరు వ్యాపారులను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. చిరు వ్యాపా రుల రక్తాన్ని పీలుస్తున్న వడ్డీని మాఫీ చేయడానికి నిర్ణయించుకున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. ‘జగనన్న తోడు’ పథకంతో చిరు వ్యాపారుల జీవితాలలో చిరుదివ్వెలను వెలిగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 10 లక్షల పైగా దీపాలవి. రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న తోడు’ లబ్ధిదారులు 10 లక్షలమంది.

ప్రాణానికి హాయి
ఇరవై ఏళ్లుగా దోశలు, పొంగనాలు వేసుకుని బతుకున్నాను. గత ఏడాది కరోనా వల్ల మొత్తం వ్యాపారం దెబ్బతినింది. ఐదు నెలలు వ్యాపారం లేదు. చేతిలో రూపాయి కూడా లేదు. కరోనా పోయిన తర్వాత వ్యాపారం మొదలుపెట్టే ధైర్యం లేకపోయింది. ‘జగనన్న తోడు’ ద్వారా బ్యాంకులో లోన్‌ తెచ్చుకుని మళ్లీ పని మొదలుపెట్టాను. వడ్డీ లేని రుణం కావడం వల్ల సులభంగా వాయిదాలు చెల్లించగలుగుతున్నా. నిమ్మళంగా వ్యాపారం చేసుకుంటున్నా. ప్రాణానికి హాయిగా ఉంది.
– జి. తులశమ్మ, అనంతపురం పట్టణం

నేను కలెక్టర్‌ ఆఫీసు ముందు బండి మీద పండ్లు అమ్ముకుంటాను. ఇంతకు ముందు మాకు బ్యాంకుల్లో రుణం వచ్చేది కాదు. బయట ఐదు రూపాయల వడ్డీకి తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు పదివేల లోన్‌ వచ్చింది. బండికి చిన్న మరమ్మతులు చేయించుకున్నాను. పండ్లు ఎక్కువగా తెచ్చుకుంటున్నాను.
– నారాయణమ్మ,అనంతపురం పట్టణం


బ్యాంకు లోన్‌ వచ్చింది
కరోనాతో దాదాపు నాలుగు నెలలపాటు టిఫిన్‌ సెంటర్‌ తెరవడం కష్టమైంది. తెరిచిన తర్వాత కూడా నెలపాటు వ్యాపారం మునుపటిలా జరగలేదు. టిఫిన్‌ సెంటర్‌ సరుకులు కొనడమే కష్టంగా మారింది. ‘జగనన్న తోడు’ పథకం ద్వారా పదివేల రూపాయల రుణం ఇవ్వడంతో మా ఇబ్బందులు తీరాయి. కావల్సినన్ని సరుకులు కొన్నాను. వ్యాపారం పుంజుకుంది. నెల నెలా కిస్తీలు కట్టి రుణాన్ని చెల్లిస్తాను, అవసరమైనప్పుడు మళ్లీ రుణం తీసుకుంటాను.
– నోముల మరియమ్మ, గుంటూరు పట్టణం

నేను సోడాలు అమ్ముకుని జీవిస్తున్నాను. గతంలో వ్యాపారానికి పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకునే వాడిని. ఎంత కష్టపడినా ఇంటి ఖర్చులు గడిచేవి కాదు. నా శ్రమంతా ఏమవుతోందని, ఇల్లు గడవాలంటే ఇంకా ఎంత కష్టపడాలో అని దిగులుగా ఉండేది. కేవలం వడ్డీలు చెల్లించడం కోసమే వ్యాపారం చేస్తున్నానా అని కూడా అనిపించేది. మరో పని తెలియదు. కుటుంబ పోషణకోసం వేరే మార్గం ఉండేది కాదు. ప్రస్తుతం ‘జగనన్న తోడు’ ద్వారా బ్యాంకులో వడ్డీలేని రుణాలు దక్కడంతో నా కష్టానికి ప్రతిఫలం దక్కుతోందనే సంతోషం కలుగుతోంది. ముఖ్యమంత్రి జగనన్నే నాకు, నా కుటుంబానికి తోడుగా ఉన్నారు.
– ఎ. బాబులు, ఏలూరు పట్టణం

ముప్పై ఏళ్లుగా పండ్ల వ్యాపారం చేసుకుంటున్నా. ప్రభుత్వ ప్రోత్సాహంతో మొదటి సారి అప్పు కోసం బ్యాంకు వైపు చూసాను. ఇలాంటి పథకాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో వాయిదాలు చెల్లిస్తాను. తనఖా లేకుండా వడ్డీ ఇచ్చేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మేము తిరిగి కట్టగలం అని నమ్ముతున్నాయి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. 
– మాబు, అనంతపురం పట్టణం

కష్టకాలంలో ఆదుకుంది
కరోనా లాక్‌డౌన్‌తో నా పిండిమర వ్యాపారం దెబ్బతిని ఆర్థికంగా  ఇబ్బందుల్లో పడ్డాను. బయట అధిక వడ్డీలతో అప్పు తీసుకోవాలంటే భయం. రోజంతా కష్టపడి అసలు, వడ్డీ చెల్లించిన తర్వాత చేతిలో ఏమీ మిగలదు. కష్టమంతా వడ్డీకి ధారపోయాల్సిందే. అటువంటి సమయంలో ‘జగనన్న తోడు’ పథకం ఆదుకుంది. 
– పి రమేష్, గుంటూరు పట్టణం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు