‘జగత్‌’ కంత్రీలు.. వెలుగులోకి 'భూమా'య..

13 Nov, 2020 08:40 IST|Sakshi

ఆళ్లగడ్డలో పీర్ల మాన్యం ఆక్రమణ 

ఆక్రమిత స్థలంలో జగత్‌ డెయిరీ నిర్మాణం 

భూమా అఖిల అనుచరుడి కబ్జా పర్వం 

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ముస్లింలు 

ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే వారే కబ్జాదారుడికి అండగా నిలిచారు. పీర్ల మాన్యం ఆక్రమణలో తమ వంతు పాత్ర పోషించారు. ఆక్రమిత స్థలంలో డెయిరీ నిర్మాణాన్ని సైతం చేపట్టారు. బాధిత ప్రజలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ‘భూ మా’య విషయం గురువారం వెలుగులోకి వచ్చింది.  

సాక్షి, నంద్యాల: ఆళ్లగడ్డ పట్టణంలోని సర్వే నం. 67లో 6.40 ఎకరాల పీర్ల మాన్యం భూమి ఉంది. దీన్ని ముల్లా మక్తుమ్‌ సాహెబ్‌ వారసులు అనుభవించేవారు. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో పీర్ల చావిడి సేవలు,   పండుగలు ఘనంగా జరిపేవారు. అయితే ఈ భూమిపై భూమా అఖిలప్రియ అనుచరుడు కోతమిషన్‌ షరీఫ్‌ కన్ను పడింది. ముల్లా కుటుంబ సభ్యులను భయపెట్టి మాన్యాన్ని కబ్జా చేశారు. ఈ భూమిని తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో ఇళ్లను నిర్మించారు. వీటిని కొంత మందికి అమ్మేశారు. మరికొంత స్థలంలో భూమా కుటుంబ సభ్యులు జగత్‌ డెయిరీని నిర్మించారు.

ఆళ్లగడ్డ పట్టణంలోని 67 సర్వే నంబరులో రికార్డుల ప్రకారం ఏయే నిర్మాణాలు ఉన్నాయో తెలపాలని ముల్లా కుటుంబం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సర్వే నంబరులో ఇళ్లు, జగత్‌ డెయిరీ, బీబీఆర్‌ స్టేడియం, షాదీఖానా, రోడ్లు, జగత్‌ డెయిరీ ఫార్మా   నిర్మాణాలు ఉన్నాయని, 4.50 ఎకరాలు ఖాళీ స్థలం    ఉందని ఆళ్లగడ్డ తహసీల్దార్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మాన్యం భూమిలో 0.66సెంట్లు ఆక్రమించి జగత్‌ డెయిరీ ఫార్మా నిర్మించినట్లు తేలింది. పీర్ల మాన్యం మొత్తం ఆక్రమణలో ఉన్నా.. రెవెన్యూ, వక్ఫ్‌బోర్డు అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ భూమా అఖిలప్రియ సైతం నోరుమెదపడం లేదు.  (అఖిలా.. ఇన్నాళ్లూ ఎక్కడికెళ్లావ్‌?)

ముస్లింలకు న్యాయం చేయాలి
భూమా అఖిలప్రియ మాటలు, చేష్టలు వేర్వేరుగా ఉన్నాయి. ముస్లింలపై ఎనలేని ప్రేమ కురిపిస్తున్నట్లు మాట్లాడుతారు. ఆళ్లగడ్డలో మాత్రం ముస్లింలకు చెందిన భూములను ఆక్రమించుకొని, అందులో కట్టడాలు నిర్మిస్తారు. ఆళ్లగడ్డలో పీర్ల మాన్యం ఆక్రమించుకున్న వారిపై జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకొని ముస్లింలకు న్యాయం చేయాలి.   – శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే 

కలెక్టర్‌కు ఫిర్యాదు.. 
పీర్ల మాన్యం ఆక్రమణకు గురైందని, తమకు న్యాయం చేయాలని ముల్లా కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని కోరారు. ముల్లా కుటుంబీకులతో కలిసి ఇరువురు ఎమ్మెల్యేలు గురువారం జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌కు వినతి పత్రం అందించారు. పీర్ల మాన్యాన్ని భూమా అనుచరుడు ఆక్రమించడంతో ఆదాయం కోల్పోయి పీర్ల పండుగ ఘనంగా నిర్వహించలేకపోతున్నామని ముల్లా వంశస్తులు మహబూబ్‌బాషా, గౌస్‌మొద్దీన్, ముక్తమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేనెంబరు 67లో ఉన్న 6.40 ఎకరాల పీర్ల మాన్యం తమకు అప్పగించి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.    (నిన్ను చంపితేగాని చైర్మన్‌ పదవి రాదు: భూమా విఖ్యాత్‌రెడ్డి)

విచారణ జరపండి.. 
ఆళ్లగడ్డ పట్టణంలోని పీర్ల మాన్యం ఆక్రమణ విషయంపై జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ వెంటనే స్పందించారు. ఆళ్లగడ్డ తహసీల్దార్‌కు ఫోన్‌ చేసి, రికార్డులను పరిశీలించి విచారణ జరపాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. 


ఇన్‌చార్జ్‌ భూమా అఖిల ప్రియ సైతం నోరు మెదపడం లేదు
ముస్లింల మాన్యం భూమిని ఆక్రమించుకొని అందులో జగత్‌ డెయిరీని నిర్మించుకున్న భూమా అఖిలప్రియకు ముస్లింల గురించి మాట్లాడే అర్హత లేదు. ముస్లింలపై మీకు నిజంగా ప్రేమ, అభిమానం ఉంటే పీర్ల మాన్యంలో నిర్మించుకున్న కట్టడాలను తీసివేసి స్థలం వారికి ఇవ్వాలి. ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేశారు. భూమా కుటుంబ సభ్యులు మాత్రం శవ రాజకీయాలు చేస్తున్నారు.   – గంగుల బిజేంద్రారెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా