నేడు జగ్గన్నతోట ప్రభల తీర్థం

15 Jan, 2021 10:58 IST|Sakshi

11 గ్రామాల నుంచి తరలిరానున్న ప్రభలు

ప్రత్యేక ఆకర్షణగా గంగలకుర్రు ప్రభ ఊరేగింపు

అమలాపురం/ అంబాజీపేట: సంక్రాంతంటే.. భోగి మంటలు.. కొత్తవస్త్రాలు.. ధాన్యం కుచ్చులు.. పిండివంటలు.. కోడి పందేలు మాత్రమే కాదు. అబ్బురపరిచే ప్రభల తీర్థాలు కూడా. ఈ తీర్థాలకు పైరు పచ్చని సీమ కోనసీమ వేదికవుతోంది. సంక్రాంతి సమయంలో  కోనసీమ వీధుల్లో నడయాడుతున్న  ఇంద్రధస్సులా తీర్థాలకు వెళ్లే రంగురంగుల ప్రభలు సీమ అందాలను రెట్టింపు చేస్తాయంటే అతిశయోక్తి కాదేమో. సీమలో జరిగే ప్రభల తీర్థాలకు వందల ఏళ్ల పురాణ చరిత్ర ఉంది. పెద్ద పండగ నాడు మొదలై... ముక్కనుమ, ఆ తరువాత రోజు వరకు కోనసీమ నలుమూలల సుమారు 90 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. వీటిని చూసేందుకు స్థానికులు.. జిల్లా వాసులే కాదు.. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తుల తరలివస్తారు.  ఇక్కడ జరిగే ప్రభల తీర్థాలు రాజులు.. బ్రిటిష్‌ పాలనల్లో సైతం నిరాటంకంగా కొనసాగాయి. అయితే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కారణంగా ఈసారి ఆంక్షల నడుమ ప్రభల తీర్థాలు జరగనున్నాయి. చదవండి: పలకరింపే పులకరింపైతే.. ప్రతిరోజూ పండగే  

ఏకాదశ రుద్రుల కొలువు
అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట తీర్థానికి ఐదు శతాబ్ధాల చరిత్ర ఉంది. నాలుగు గ్రామాల శివారులోని ఒక కొబ్బరితోటలో సాగుతుంది. కనుమపండగ నాడు జరిగే తీర్థంలో మొసలపల్లి భోగేశ్వరస్వామి, గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామిలు జగ్గన్నతోటలో సమావేశమై లోక కల్యాణార్థం చర్చలు జరుపుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా జరిగే సమావేశానికి వ్యాఘ్రేశ్వరస్వామి అధ్యక్షతవహిస్తారు. స్వామివారి ప్రభ తీర్థానికి వచ్చే సమయంలో మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకెత్తి దింపుతారు. గంగలకుర్రు అగ్రహారం, గంగలకుర్రు ప్రభలు జగ్గన్నతోటను ఆనుకుని ఉండే పెద్ద కౌశికను దాటుకు వచ్చేతీరు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తుంది.  ఇదే మండలం వాకలగరువు, తొండవరం గ్రామంలో ఏటా ఒకరికొకరు పోటీ పడుతూ 42 అడుగులకు పైబడి ఎత్తులో ప్రభలు నిర్మిస్తారు.   
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు