ఏపీ: ఏ పార్టీతోనూ సంబంధం లేదు.. ఇసుక ఆపరేషన్స్‌ అసత్య కథనాలపై జేపీవీఎల్‌

14 Sep, 2022 04:21 IST|Sakshi

జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ 

సబ్‌ కాంట్రాక్టులు, ఇసుక దోపిడీలో నిజం లేదు

ఓ పత్రిక తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

నిర్దేశిత విధానంలో ఇసుక ఆపరేషన్స్‌ నిర్వహిస్తున్నాం 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధానంలోనే తాము ఇసుక ఆపరేషన్స్‌ నిర్వహిస్తున్నామని జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (జేపీవీఎల్‌) సంస్థ స్పష్టం చేసింది. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని, ఓ పత్రికలో ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు జేపీవీఎల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పంకజ్‌ గౌర్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా తమ సంస్థపై అసత్యాలతో కూడిన వార్తలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. జేపీవీఎల్‌ ఇసుక సబ్‌ కాంట్రాక్టులను అధికార పార్టీ నేతలకు జిల్లాల వారీగా ఇచ్చినట్లు ఎల్లో మీడియా రెండు రోజులుగా తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. ప్రభుత్వమే ఈ సబ్‌ కాంట్రాక్టులను ఇస్తున్నట్లు, ఇసుకలో భారీ దోపిడీ జరుగుతున్నట్లు అసత్య కథనాలను వెలువరిస్తోంది.

ఈ నేపథ్యంలో దీనిపై జేపీవీఎల్‌ సంస్థ స్పందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీ ద్వారా నిర్వహించిన టెండర్లలో తమ సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌ నిర్వహణను దక్కించుకున్నట్లు పేర్కొంది. టెండర్లలో మిగిలిన సంస్థలతో పోటీ పడి తమ సాంకేతిక, ఆర్థిక సామర్థ్యాన్ని నిరూపించుకుని కాంట్రాక్టు పొందినట్లు వెల్లడించింది.

టెండర్‌ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను పాటిస్తూ ఇసుక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. తమ సంస్థకు విద్యుత్, కోల్‌ మైనింగ్‌ రంగాల్లో విస్తారమైన అనుభవం ఉందని, తాము చేపట్టిన ఏ ప్రాజెక్టునైనా సమర్థంగా నిర్వహిస్తామని పేర్కొంది. 

ఇతరులు లావాదేవీలు నిర్వహిస్తే క్రిమినల్‌ కేసులు..
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు టెండర్ల ద్వారా దక్కించుకున్న జేపీవీఎల్‌ అనుమతించిన వ్యక్తులకు మాత్రమే అవకాశం ఉందని జిల్లాల ఎస్పీలు స్పష్టం చేశారు. ఇతరులు ఎవరైనా ఇసుక సబ్‌ కాంట్రాక్టర్‌ లేదా ఇతర పేర్లతో లావాదేవీలు జరిపితే చట్టపరంగా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సబ్‌ కాంట్రాక్టులు పొంది జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నట్లు ఎవరైనా ప్రచారం చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జీపీవీఎల్‌ పోలీస్‌ శాఖను కోరినట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు