నిమ్మ.. ధర అదిరెనమ్మ! 

22 May, 2022 23:00 IST|Sakshi
జమ్మలమడుగు మండలంలో సాగులో ఉన్న నిమ్మతోట  

దిగుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ 

ఉద్యాన పంటల్లో సిరులు కురిపించిన నిమ్మ 

ఆనందంలో రైతన్నలు 

జమ్మలమడుగు: జిల్లాలో నిమ్మ సాగు చేసిన రైతులకు కాసుల పంట పండింది. ఈ ఏడాది నిమ్మ దిగుబడి తక్కువగా ఉన్నా ధర ఎక్కువగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 3527 ఎకరాల్లో నిమ్మతోటలను సాగుచేశారు. గత ఏడాది భారీ వర్షాల కారణంగా నిమ్మతోటలు చాలా వరకు దెబ్బతిన్నాయి.

సాధారణంగా వేసవి కాలంలో ప్రతి ఏడాది భారీగా దిగుబడి వచ్చేది. అయితే ఈ ఏడాది భూమిలో తేమశాతం ఎక్కువ కావడంతో నిమ్మ చెట్లకు ఉన్న పూత రాలిపోయింది. దీంతో దిగుబడి కాస్త తగ్గిపోయింది. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో నిమ్మకాయలకు భారీ గిరాకీ వచ్చింది. 

నిమ్మకాయల బస్తా రూ.7వేలు 
నిమ్మకాయల బస్తా ఏడు వేల రూపాయలు పలికింది. ప్రతి బస్తాలో 800 నుంచి 1000 నిమ్మకాయలు నింపి వరిగడ్డి వేసి బస్తాలను బెంగళూరుకు ఎగుమతి చేస్తూ వచ్చారు. జిల్లాలో పులివెందుల డివిజన్‌ ప్రాంతంలో అత్యధికంగా 1750 ఎకరాల్లో నిమ్మసాగును రైతులు సాగుచేస్తున్నారు. ఆ తర్వా త కడప డివిజన్‌లో 868 ఎకరాలు, జమ్మలమడుగు డివిజన్‌లో జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో 549 ఎకరాల్లో, బద్వేలు డివిజన్‌లో 360 ఎకరాల్లో పంటను సాగుచేశారు. ప్రస్తుతం పంట తక్కువగా ఉండటంతో వచ్చిన దిగుబడిని ఏరోజుకారోజు బెంగళూరుకు ప్రత్యేక వాహనాలలో ఎగు మతి చేసి అత్యధికంగా లాభాలను ఆర్జిస్తున్నారు. 

అధికారులు సలహాలు ఇవ్వాలి  
ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నా నిమ్మ కు మంచి గిరాకీ ఉంది. ప్రతి ఏడాది తోటలో 15 చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గిపోతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో   రైతులకు సూచనలు సలహాలు ఇస్తే పంట దిగుబడి పెంచుకుంటాము. 
– నరసింహ, నిమ్మరైతు, గండికోట

ఎండుపుల్లలు కత్తిరించాలి  
ప్రస్తుతం నిమ్మకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. రైతులు మంచి దిగుబడి పొందాలంటే చెట్లపై ఉన్న ఎండు పుల్లలను కత్తిరించి సున్నం, మైలుతుత్తి కలిగిన బార్డోపేస్ట్, బోర్డో పిచికారీ చేస్తే ఎండు తెగులు, ఎండు పుల్లలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు.  
–భరత్‌రెడ్డి, ఉద్యాన అధికారి

మరిన్ని వార్తలు