టెన్త్‌ దరఖాస్తుల్లో వారి పేర్లకు బదులు నిత్యం కొలిచే దేవుళ్ల పేర్లు

24 Aug, 2021 08:35 IST|Sakshi
జనహిత–వాత్సల్య సేవా సంస్థలోని అనాథ పిల్లలు

అమ్మానాన్నలు ఎవరో తెలీక ధుృవపత్రాలకు దూరం

ఆధార్‌కార్డు లేక అవస్థలు

అమ్మఒడి అర్హత కోసం ప్రయత్నాలు 

స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం

ఇలాంటి వారిని ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలంటున్న అనాథాశ్రమాలు

‘‘నెల్లూరు నగరంలో ఓ అనాథ యువతి ఆశ్రమంలో ఉంటూ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు చేస్తోంది. ఆమెకు నెలవారీగా వచ్చే స్టైఫండ్‌ రూ.3 వేలను దాచుకునే నిమిత్తం అకౌంట్‌ తెరిచేందుకు బ్యాంకుకు వెళ్లింది. కానీ, ఆమె వద్ద అవసరమైన ధ్రువపత్రాల్లేవని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. దీంతో ఆశ్రమం నిర్వాహకుల వద్దే ఆమె ఆ మొత్తాన్ని దాచుకుంటోంది’’.. ఇది ఈ ఒక్క యువతి ఇబ్బందే కాదు.. ఇలాంటి ఎంతోమంది అనాథలు రాష్ట్రవ్యాప్తంగా ఎదుర్కొంటున్న కష్టాలు. అమ్మానాన్నలు లేని ఫలితంగా ఎలాంటి ధుృవపత్రాలకు నోచుకోక వీరు పలు ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి కథే నెల్లూరు నగరంలోని ఓ అనాథాశ్రమం విద్యార్థుల వ్యథ.

సాక్షి, నెల్లూరు:  నెల్లూరు నగరంలోని కొండాయపాళెం రోడ్డు సమీపంలోని రామకృష్ణానగర్‌లో ఉన్న జనహిత–వాత్సల్య సేవా సంస్థలో దాదాపు 117 మంది అనాథ బాలలు ఆశ్రయం పొందుతున్నారు. ఈ సంస్థ కేవలం దాతల దాతృత్వంతో నడిచే సంస్థ. ఈ సంస్థ భారతీయ విద్యా వికాస్‌ పేరుతో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలను నిర్వహిస్తోంది. ఇందులో అనాథ బాలలతోపాటు ఇతరులు కూడా విద్యను అభ్యసిస్తున్నారు.

జనహిత–వాత్సల్య సేవా సంస్థ ప్రాంగణం 

ఈ సేవా సంస్థలో ఆశ్రయం పొందిన వారు కొందరు ఉన్నత చదువులు చదువుకున్న వారూ ఉన్నారు.  చదువుల అనంతరం వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన వారు కూడా ఉన్నారు. ఇక్కడి ఆడపిల్లలకు అమ్మానాన్న లేని లోటు తెలీకుండా పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపుతున్నారు. కానీ, ఈ అనాథలకు పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

దేవుళ్లనే తల్లిదండ్రులుగా భావిస్తూ..
పదో తరగతి చదివే విద్యార్థులు పరీక్ష దరఖాస్తుల్లో తల్లిదండ్రుల పేర్లు రాయాలి. కానీ, వారెవరో తెలియని ఈ అనాథలు దేవుళ్లనే తమ తల్లిదండ్రులుగా భావించి సరస్వతి, లక్ష్మీ, పార్వతి, శివయ్య, బ్రహ్మ, విష్ణుమూర్తి వంటి పేర్లను రాసుకుంటున్నారు. గతంలో టెన్త్‌ పరీక్షల సందర్భంలో తండ్రి పేరే రాయాల్సి ఉండేది. 2009 సెప్టెంబర్‌ 14 నుంచి తల్లి పేరు తప్పనిసరి చేశారు. అప్పటివరకు తండ్రి పేరు రాసేందుకు తంటాలు పడిన ఈ అనాథ విద్యార్థులు దీంతో  తల్లిదండ్రులుగా దేవుళ్లు, దేవతల పేర్లనే దరఖాస్తులలో పేర్కొంటున్నారు.

జనహిత–వాత్సల్య సేవా సంస్థ 

సంక్షేమానికి దూరంగా..
ప్రభుత్వం విద్యను ప్రొత్సహించేందుకు ప్రవేశపెట్టే పథకాలకూ ఈ అనాథలు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ పథకాలకు ప్రధానంగా రేషన్‌కార్డు, కులం, ఆదాయం, ఆధార్‌కార్డు తప్పనిసరి. ఇవన్నీ ఎలా వస్తాయో తెలియని ఈ అనాథలు సంక్షేమ పథకాలకు నోచుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వాలు వీరిని ప్రత్యేకంగా పరిగణించి ఎస్సీ, ఎస్టీల జాబితాలో చేర్చి అన్ని సదుపాయాలు కల్పిస్తే వీరు సమాజంలో ఉన్నత పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది.

 జనహిత–వాత్సల్య సేవా సంస్థలో భోజనానికి ముందు ప్రార్థన చేస్తున్న బాలలు

అమ్మఒడిపై స్పందించిన సర్కార్‌
ప్రస్తుత ప్రభుత్వం విద్యను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం పేద వర్గాలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. కేవలం ఆధార్‌కార్డు రానందున ఈ పథకానికి అనాథలు అర్హత సాధించలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం స్పందించి వచ్చే విద్యా సంవత్సరంలోనైనా అమ్మఒడి వర్తించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. స్థానిక అధికారులూ వీరికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

అనాథలను గుర్తించాలి
ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా అనాథ బాలలకు సరైన న్యాయం చేయలేకపోయింది. సమాజంలో వారికి గుర్తింపు లేకుండాపొయింది. ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ వారు నోచుకోలేకపోతున్నారు. అమ్మఒడి పథకం వారికి వర్తింపజేయాలి.– జీవీ సాంబశివరావు, వాత్సల్య అనాథాశ్రమ సంస్థాగత కార్యదర్శి

సమాజంలో వారికి గుర్తింపునివ్వాలి
అనాథలను ప్రభుత్వాలు అక్కున చేర్చుకోవాలి. గత ప్రభుత్వాలు అనాథల విషయంలో సరైన న్యాయం చేయలేకపోయాయి. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం స్పందించి వారికి అమ్మఒడి పథకం వర్తించేలా కసరత్తు చేయడం హర్షణీయం. అనాథలు అంటే మన పిల్లలే అనే భావన అందరిలో కలగాలి. – సామంతు గోపాల్‌రెడ్డి, వాత్సల్య సేవా సంస్థ గౌరవాధ్యక్షులు

మరిన్ని వార్తలు