టీడీపీతో విజయ్‌కుమార్‌ కుమ్మక్కు.. జన సైనికుడు కిరణ్‌ ఆవేదన

9 Jun, 2022 11:21 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: నాడు ప్రజారాజ్యం పార్టీ నుంచి నేడు జనసేన పార్టీ వరకు మెగా ఫ్యామిలీ అభిమానిగా, గ్రామ నాయకుడిగా సేవలందిస్తున్న తనపై జనసేన ముసుగులో ఉన్న టీడీపీ నాయకుడు సుందరపు విజయ్‌కుమార్, అతడి అనుచరులు దాడి చేసినా అధిష్టానం స్పందించ లేదని ఎర్రిపల్లి కిరణ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

జనసేన పార్టీని టీడీపీకి తాకట్టు పెడుతున్న అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల విశాఖకు వచ్చిన జనసేన ముఖ్య నాయకుడు నాగబాబు దృష్టి తీసుకెళ్లినందుకు దాడి చేశారన్నారు. విజయ్‌కుమార్‌ లాంటి వారి వల్ల పార్టీ నాశనమవుతోందన్నారు. జనసైనికులుగా పార్టీపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, ఇలాంటి వారు భ్రష్టుపట్టిస్తున్నారని వాపోయారు. గతంలోనూ అతడి ఆగడాలను జనసేన అధ్యక్షుడికి, పార్టీ ప్రధాన కార్యాలయానికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా ఫిర్యాదు చేశానన్నారు.

అయినా వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. యలమంచిలి నియోజవర్గ ఇన్‌చార్జి సుందరపు విజయ్‌కుమార్, సుందరపు సతీష్‌కుమార్, గాజువాకకు చెందిన ఏడిద భార్గవ శ్రీనివాసరావు, కాశీందేవుల సతీష్, కోఠారి నరేష్, కాళ్ల చంద్రమోహన్, ప్రకాష్, భాస్కరరావు, శివశంకర్, బొద్దపు శ్రీనివాస్‌ తనను గదిలో ఆరు గంటలపాటు బంధించి దాడి చేశారన్నారు. వారిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు.   

చదవండి: (సీఎం జగన్‌ను కలిసిన సివిల్‌ సర్వీసెస్‌ విజేతలు)

మరిన్ని వార్తలు