జనసేనాని గందరగోళం! ప్చ్‌.. సీఎం రేసులో మళ్లీ ఆ ఇద్దరే?!

19 Dec, 2022 16:26 IST|Sakshi

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. యధాప్రకారం  మరోసారి గందరగోళంగా మాట్లాడారు. ఆ ప్రసంగం చూస్తే.. పాపం ఆయనకు ముఖ్యమంత్రి కావాలానే ఆకాంక్ష బలంగా ఉన్నా, పరిస్థితి చూస్తే గెలవలేనేమోనన్న భయంతో ఉన్నట్లు అనిపిస్తోంది. వ్యతిరేక ఓటును చీలనివ్వనని అంటారు. మీరు బలంగా కోరుకుంటే ముఖ్యమంత్రిని అవుతానని చెబుతారు. అధికారం కోసం లేనని కొన్నిసార్లు అంటారు. అణగారిన వర్గాలకు అధికారం రావాలని చెబుతారు. జనసేనను అధికారంలోకి తీసుకు వచ్చే బాధ్యతను తనకు వదలివేయమని సలహా ఇస్తారు.. ఇంతకీ ఏతావాతా ఆయనకు ఉన్న ఒకే ఒక లక్ష్యం ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఓడించాలన్నదే!. అంతే తప్ప, స్పష్టమైన ఎజెండా ఆయనకు లేదన్నది అడుగడుగునా తెలుస్తూనే ఉంది.

సత్తెనపల్లి వద్ద జరిగిన సభలో మాట్లాడుతూ.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, అన్ని పార్టీలను కలుపుతానని పవన్ కల్యాణ్‌ అన్నారు. అంటే దీని అర్ధం ఏమిటి? తెలుగుదేశం, జనసేన, బిజెపీ, కాంగ్రెస్, వామపక్షాలు అన్నింటిని కలుపుతారా? అది ఎలా సాధ్యం ? ముందుగా తాను బిజెపితో పొత్తులో ఉన్నారా?లేదా?.. దాని సంగతేమిటి? మరో వైపు బిజెపికి, టిడిపికి అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదని ఆయన అంటారు. ఈ అమ్ముడుపోవడం గురించి ఆయన ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఇంతకీ  ముఖ్యమంత్రి కావడానికి ఆయన వద్ద ఉన్న కార్యాచరణ ఏమిటి? అందని వర్గాలకు అధికారం అని ఇంకో పక్క చెబుతూ, టిడిపి పొత్తు పెట్టుకుని ఏ వర్గాన్ని అందలం ఎక్కించాలని అనుకుంటున్నారు. కులాల గురించి మాట్లాడను అంటూనే కాపుల ప్రస్తావనను తేవడం ద్వారా ఆయన ఏమి చెప్పదలిచారు? కాపులు ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష ఆ వర్గంలో బలంగా ఉన్నదని, ఇటీవలే సమావేశం అయిన కొందరు కాపు నేతలు చెప్పారు. మరి అలాంటప్పుడు..

పవన్ కళ్యాణ్ తానే సీఎం అభ్యర్దిని అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? పోనీ పలానా బలహీనవర్గాల అభ్యర్ధిని ముఖ్యమంత్రిని చేస్తాం అని ఆయన అనగలరా? అసలు తెలుగుదేశంకు అత్యధిక సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకున్నాక, ఒకవేళ అధికారం వస్తే చంద్రబాబు లేదా లోకేష్ లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది తప్ప  పవన్ కళ్యాణ్ కు ఉండదు కదా. అప్పుడు చంద్రబాబు, లోకేష్‌లను  అణగారిన వర్గాలవారిగానే పవన్ చూస్తారా? వారికి అధికారం ఇస్తే పవన్ లక్ష్యం నెరవేరినట్లేనా?

నిజానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్‌ను ఎదుర్కునే సత్తా లేకపోవడం వల్లే కదా? చంద్రబాబు కాని, పవన్ కాని ఎలా కలవాలా అని తహతహ లాడుతున్నారు. ఆ పార్టీతో కలుస్తా? ఈ పార్టీతో కలుస్తా? అందరిని కలుపుతా? అంటూ డైలాగులు చెబుతున్నారు. వైసీపీని  అధికారంలోకి రానివ్వమని ఆయన చెబుతున్న తీరు.. ఉత్తితపిట్ట మాదిరిగా ఉంది. ఆదివారం నాడు మాత్రమే రావడాన్ని సమర్ధించుకుంటూ, ఒక్కరోజు వస్తేనే వైసీపీ వాళ్లు వణికిపోతున్నారట!. రోజూ వస్తే ఎలా ఉంటుందో చూపిస్తారట!. ఏమిటీ డైలాగులు. మాటలు మాత్రం కోటలు దాటుతాయన్నట్లుగా ఆయన స్పీచ్ లు ఇస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ ఉపన్యాసం వింటే ఆయన ఏమి చేయదలచుకున్నారో ఆయన సభకు హాజరైన వారికి గాని, టీవీలలో చూసినవారికిగాని, పత్రికలలో చదివినవారికి గాని అర్ధం అయితే ఒట్టు. తన సినిమా అభిమానులకు ఆయన ఏమి చేసినా బాగుండవచ్చు. కాని మిగిలిన ప్రజలకు ఇందులో ఏమి సబ్జెక్ట్ ఉందన్న ప్రశ్న వస్తుంది.  బిజెపీ, టీడీపీ, జనసేన కూటమి 2019లో పోటీచేసి ఉంటే బాగుండని ఇప్పుడంటున్నారు. పేరుకు బిఎస్పీ, వామపక్షాలతో పొత్తు తప్ప, పరోక్షంగా టీడీపీ వారికి సాయం చేసే విధంగానే పవన్ రాజకీయం చేశారన్నది బహిరంగ రహస్యం.  జనసేన అభ్యర్ధులను కూడా టీడీపీ అధినాయకత్వమే నిర్ణయించిన సంగతి జనం మర్చిపోలేదు. ఏదో చిత్తశుద్దితో రాజకీయం చేసినట్లు, వీక్లిస్టార్ మాట్లాడుతున్నారు.  వైసిపి కి వ్యతిరేకంగా ఉన్న బిజెపిని, కాంగ్రెస్ ను కూడా కలపడం సాధ్యమేనా? బిజెపి, వామపక్షాలు ఉప్పు,నిప్పుగా ఉంటాయి. వాటిని కలపగలరా? అసలు బిజెపికి టిడిపితో జతకట్టడం ఇష్టం లేదు అన్న సంగతిని పవన్ కాదనగలరా? 

ప్రధాని మోడీ తనకు ఏమి చెప్పారో ఇంతవరకు ఎందుకు వెల్లడించలేకపోయారు? ఇలాంటి స్థితిలో ఆయన ఏమి చెప్పినా దానికి ఏమి విలువ ఉంటుంది? లేదూ.. చాలా నిర్దిష్టంగా తాను టీడీపీతో కలవబోతున్నానని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు, లోకేష్ లు ముఖ్యమంత్రి అభ్యర్ధులు కారని, వారు తననే  సీఎం అభ్యర్ధిగా అంగీకరిస్తారని పవన్ చెప్పగలిగితే, దానిని టీడీపీ ఎండార్స్ చేస్తే అప్పుడు ఏమైనా ఆలోచించవచ్చు. రౌడీయిజం తగ్గాలని అనడం బాగుంది. మరి విశాఖ ఎయిర్ పోర్టులో జనసేన కార్యకర్తలు చేసిన రౌడీయిజం మాటేమిటి? మాచర్లలో వైసిపిశ్రేణులపై టీడీపీవాళ్లు ముందుగా దాడి చేసిన తర్వాత గొడవలు జరిగాయి. దానిని దాచిపుచ్చి ఈనాడు వంటి పత్రికలు మోసపూరితంగా రాస్తుంటే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను బ్లాక్ మెయిల్ చేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. వీటి గురించి  ప్రస్తావించలేని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని బుజాన వేసుకుని ఎందుకు మోస్తున్నారు. ఎవరు రౌడీయిజం చేసినా తప్పే అని ఎందుకు అనలేకపోయారు. టీడీపీ భాషలో మాట్లాడమే కాకుండా,  తనను , వైసిపి నేతలను గాడిదలని అంటే  మంత్రి అంబటి రాంబాబు  ఊరుకుంటారా? అందుకే చంద్రబాబును గాడిదలా మోస్తున్నది , కాపులను బానిసలుగా మార్చాలని చూస్తున్నది పవన్ కళ్యాణే అని తిప్పికొట్టారు. తన రాజకీయ వ్యూహం ఏమిటో తనకే తెలియనట్లుగా వ్యవహరిస్తున్న ఆయన ఇప్పటికైనా ఒక నిర్దిష్ట ఎజెండాతో, పొత్తులపై ఒక స్పష్టతతో రాకపోతే, ఆయనవన్నీ ఉబుసుపోక కబుర్లు అని, గాలికబుర్లు అని జనం అనుకుంటే ఆశ్చర్యం ఏమి ఉంటుంది?


:::హితైషి
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

మరిన్ని వార్తలు