శ్రుతిమించిన జనసేన నేత అరాచకాలు.. కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ 

22 Oct, 2022 12:31 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.42 లక్షలు అప్పు తీసుకున్నాడు. రుణం తీర్చమని అడిగితే బెదిరింపులకు దిగాడు. పెద్ద మనుషుల ముందు పెడితే ఒప్పుకున్నట్లే తల ఊపి, మళ్లీ తన బుద్ధి చూపించాడు. ఈ దౌర్జన్య వైఖరిపై బాధితులు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓ జనసేన నాయకుడు. పేరు బస్వ గోవింద రెడ్డి. అలియాస్‌ గుర్రాలరెడ్డి. రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామ వాసి. ఈయనను  శుక్రవారం జేఆర్‌పురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసే కాదు ఇంతకు ముందు ఇలాంటి ఘన కార్యాలు ఎన్నో చేశాడు.  

అప్పు తీసుకుని దాడులు..  
విశాఖపట్నంలోని చిన్ని వెంకటరావు అనే వ్యక్తి వద్ద బస్వ గోవిందరెడ్డి రూ. 42 లక్షలు రొయ్యిల చెరువుల వ్యాపారం కోసం అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించలేదు. వడ్డీలు కట్టమని అడిగినా స్పందించ లేదు సరికదా డబ్బులు అడిగినందుకు ఆయన ఇంటికెళ్లి దౌర్జన్యం చేశారు. దీనిపై  జేఆర్‌ పురం పోలీస్‌ స్టేషన్‌లో వెంకటరావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పెద్ద మనుషుల వద్ద ఒప్పందం చేసుకున్నాడు. రూ.42 లక్షలకు గాను ప్రామిసరీ నోటులు, చెక్కులు రాసి కొద్ది రోజుల్లో ఇస్తానని ఒప్పుకున్నాడు. 

అయితే పెద్ద మనుషులు సమక్షంలో ఒప్పుకున్న తేదీలు పూర్తి కావచ్చినా డబ్బులు ఇవ్వలేదు. వడ్డీ కాకపోయినా అసలైనా ఇవ్వాలని గోవింద రెడ్డిని పలుమారు వెంకటరావు, వారి కుటుంబ సభ్యులు అడిగితే భౌతికంగా వారిపై దాడి చేశాడు. దీంతో వెంకటరావు కుటుంబ సభ్యులు గోవిందరెడ్డి రాసిచ్చిన రూ.16.50 లక్షలు విలువ గల ప్రామిసరీ నోట్లు కోర్టులో వేశారు. ఈ కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. దీంతో శుక్రవారం ఉదయం జేఆర్‌పురం ఎస్‌ఐ రాజేష్‌ కొచ్చెర్ల పంచాయతీలోని అతని ఇంటికి వెళ్లి అరెస్టు చేశారు. అనంతరం విశాఖపట్నం కోర్టుకు తరలించారు.   

గతంలోనే రౌడీషీట్‌..  
కొచ్చెర్ల గ్రామంలో బస్వ గోవిందరెడ్డి వ్యవహారం మొదటి నుంచీ వివాదాస్పదమే. గుర్రాల రెడ్డి అని పిలిచుకునే గోవింద రెడ్డి వద్ద రెండు గుర్రాలు ఉండేవి. మత్స్యకార గ్రామాల్లో గుర్రాలపై హల్‌చల్‌ చేస్తుండేవాడు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలో అడ్డు తగులుతూనే వస్తున్నాడు. ప్రస్తుతం అరెస్టు వారెంట్‌ జారీ చేసిన కేసులో వెంకటరావు కుటుంబ సభ్యులపై భౌతిక దాడులే కాకుండా తుపాకులతో బెదిరించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో అప్పలస్వామి అనే వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం భవన నిర్మాణాలు అడ్డుకుని బెదిరింపులకు దిగాడు. దీంతో పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ సత్యవతి గోవిందరెడ్డిపై కేసు పెట్టారు. అంతకుముందు మరికొన్ని దాడులు, దౌర్జన్య కేసులు నమోదయ్యాయి. దీంతో జేఆర్‌ పురం పోలీస్‌ స్టేషన్‌లో 20 సెప్టెంబర్‌ 2021లో రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు.  

‍ప్రేమ జంట కుటుంబ సభ్యులపై దాడి
కొచ్చెర్ల గ్రామంలోని వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరు మేజర్లు ముంత దుర్గాప్రసాద్, బస్వ ఉర్వశిరెడ్డి ప్రేమించుకుని హైదరాబాద్‌లోని ఆర్య సమాజంలో గత నెల 27న పెళ్లిచేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన బస్వ గోవిందరెడ్డి అదే నెల 29న పెళ్లి కుమారుడైన దుర్గాప్రసాద్‌ ఇంటికి వెళ్లి సామాన్లు అన్నీ బయటపడేసి ధ్వంసం చేశాడు. అడ్డువచ్చిన ప్రసాద్‌ తల్లిదండ్రులు రాములమ్మ, అప్పలరాముడులపై భౌతికంగా దాడి చేశాడు. దీనిపై గత నెల 30వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయానికి నలుగురు వెళ్లి ఫిర్యాదు చేసి కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై కూడా బస్వ గోవిందరెడ్డిపై జే.ఆర్‌.పురం పోలీసులు కేసు నమోదు చేశారు.   

మరిన్ని వార్తలు