జనసేన పార్టీ కొత్త కమిటీ ఏర్పాటు

8 Jul, 2021 05:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ 34 మందితో రాష్ట్ర నూతన కమిటీని నియమించింది. ఆ పార్టీలో నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో బుధవారం కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ప్రధాన కార్యదర్శులతో పాటు 17 మంది కార్యదర్శులు, 13 మంది సంయుక్త కార్యదర్శుల పేర్లను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. పార్టీలోని ఆరు అనుబంధ విభాగాలకు చైర్మన్లను కూడా నియమించారు. తొమ్మిది జిల్లాలకు కొత్తగా పార్టీ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. ఇదిలావుండగా.. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పలు సంఘాల నేతలు పవన్‌కల్యాణ్‌ను కలిసినట్టు ఆ పార్టీ వేర్వేరు ప్రకటనల ద్వారా తెలిపింది. పలువురు నిరుద్యోగ యువకులతో పాటు సీఎం నివాసిత ప్రాంతంలోని నిర్వాసితులు, భవన నిర్మాణ కార్మిక సంఘ ప్రతినిధులు, రాజధాని ప్రాంత రైతులు,  పలువురు స్టాఫ్‌ నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది ఆయనను కలిసినట్టు పేర్కొంది.

జల వివాదంపై నిపుణులతో చర్చ
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జల వివాదంపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో జల వనరుల రంగంలోని నిపుణులతో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. బుధవారం పార్టీ కార్యాలయానికి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ పార్టీ ముఖ్య నాయకులతో జల వివాదంపై చర్చించారు. నిపుణులతో నిర్వహించే చర్చా కార్యక్రమంలో వ్యక్తమయ్యే అభిప్రాయాలను ప్రజలకు తెలియజేస్తామని పార్టీ ప్రకటించింది.  

మరిన్ని వార్తలు