Pawan Kalyan: మళ్లీ అదే కుమ్మక్కు కుట్ర

15 Mar, 2022 03:37 IST|Sakshi

జనసేన మరోసారి చంద్రబాబుకు తాకట్టు

టీడీపీ ప్రయోజనాలు కాపాడే పనిముట్టునని మరోసారి నిరూపించిన పవన్‌

పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో బాబు, టీడీపీని పల్లెత్తు మాట అనని జనసేనాని

ప్రసంగమంతా అధికార వైఎస్సార్‌సీపీపై నిరాధార ఆరోపణలతోనే సరి

చంద్రబాబును సీఎం చేద్దాం అని పరోక్షంగా కార్యకర్తలకు సందేశం

టీడీపీ రాజకీయంగా పతనమవుతున్న దశలో హఠాత్తుగా జనసేన ఆవిర్భావ ప్రకటన

అప్పటి నుంచీ టీడీపీ కోసమే పని చేస్తున్న పవన్‌

గత ఎన్నికల్లోనూ చంద్రబాబు ప్రయోజనాల కోసమే పోటీ, బీఎస్పీతో పొత్తు

అయినా ఇద్దరినీ చిత్తుగా ఓడించిన ఏపీ ఓటర్లు

సాక్షి, అమరావతి : ముసుగులు తొలగిపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కుమ్మక్కు రాజకీయం మరోసారి బట్టబయలైంది. తాను టీడీపీ రాజకీయ ప్రయోజనాలు కాపాడేందుకు ఉపయోగపడే ఓ పని ముట్టునని పవన్‌ మరోసారి నిరూపించారు. ఈసారి కూడా  ‘ప్యాకేజీ స్టార్‌’గా మిగిలిపోయారు.

చంద్రబాబు సేవలో తరిద్దాం... రండి
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈసారైనా సరైన దిశానిర్దేశం చేస్తారని ఆశించిన ఆ పార్టీ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది.  ‘రండి.. చంద్రబాబును సీఎం చేద్దాం’ అని పవన్‌ కల్యాణ్‌ తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పేశారు. రాష్ట్రంలో మూడో ప్రత్యమ్నాయంగా జనసేన ఆవిర్భవించాలని ఆ పార్టీ కార్యకర్తలు ఆశించారు. కానీ వారి అభిమతం కంటే తనకు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలే ప్రధానమని ఈ సభ సాక్షిగా పవన్‌ కల్యాణ్‌ తేల్చి చెప్పేశారు. సభలో ఒక్కసారి కూడా టీడీపీపైన, చంద్రబాబుపైన విమర్శ చేయలేదు. ప్రసంగం మొత్తం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిరాధారణ ఆరోపణలతోనే సరిపుచ్చారు. తన రాజకీయ కుమ్మక్కు కుట్రకు ‘వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాం’ అంటూ అందమైన ముసుగు వేశారు. అందుకోసం ఎవరితోనైనా కలుస్తామని కూడా బహిరంగంగానే చెప్పారు.

బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇస్తామందని, ఇప్పటివరకు ఇవ్వలేదనడమూ టీడీపీ వైపు మొగ్గును చెబుతున్నట్లని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు జనసేనను అధికారంలోకి తీసుకువచ్చి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎన్నికల హామీలను నెరవేరుస్తానని పవన్‌ సూటిగా చెప్పకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇది చంద్రబాబును సీఎంని చేయడమే పవన్‌ లక్ష్యమని చెప్పినట్లని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. దాదాపు ఏడాదిగా జనసేన సమావేశాల్లో కార్యకర్తలు పవన్‌ను ఉద్దేశించి ‘సీఎం... సీఎం’ అని నినాదాలు చేస్తుంటే ఆయన వద్దని వారిస్తున్నారు. తమ అధినేత అలా ఎందుకు చెబుతున్నారో ఇప్పుడు అర్థమైందని, చంద్రబాబును సీఎం చేద్దామన్నది ఆయన ఉద్దేశమని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. 

చంద్రబాబుకు మరోసారి తాకట్టు
టీడీపీ ప్రయోజనాల కోసమే ఆవిర్భవించిన జనసేన పార్టీ మరోసారి అదే పంథాను ప్రదర్శించింది. 2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటములతో చంద్రబాబు రాజకీయంగా తెరమరుగయ్యే స్థితిలో ఉండగా.. పవన్‌ కల్యాణ్‌ హఠాత్తుగా 2014లో జనసేన పార్టీని స్థాపిస్తున్నట్టు విశాఖలో ప్రకటించారు. ఆ ఎన్నికల్లో పోటీ చేశారా అంటే అదీ లేదు. జనసేన విడిగా పోటీ చేస్తే టీడీపీకి రాజకీయంగా ఇబ్బందని చంద్రబాబు చెప్పడంతో పవన్‌ ఎన్నికల గోదాలోకి దిగలేదు. తన అభిమానులను గంపగుత్తగా చంద్రబాబుకు తాకట్టు పెట్టి ప్యాకేజీ స్టార్‌గా విమర్శలు ఎదుర్కొన్నారు. చంద్రబాబుతో కలిసి వేదికలెక్కారు. టీడీపీ కోసం ప్రచారం చేశారు.

ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని పేరిట పంట పొలాలను  గుంజుకునేందుకు ప్రయత్నించగా రైతులు తిరగబడ్డారు. వెంటనే పవన్‌ కల్యాణ్‌ టీడీపీ ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వచ్చారు. రైతుల తరపున మాట్లాడినట్టుగా డ్రామా నడిపి.. ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నించారు. 2018 నాటికి టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తింది. దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి చంద్రబాబు డైరెక్షన్‌లో పవన్‌ మంగళగిరిలో బహిరంగ సభ పెట్టారు. ప్రభుత్వంపై తూతూ మంత్రంగా విమర్శలు చేస్తూ.. అంతకంటే ఎక్కువగా అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు గుప్పించారు. తద్వారా టీడీపీని వ్యతిరేకించే ప్రజలు 2019లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేయకుండా అడ్డుకట్ట వేయాలని కుట్ర పన్నారు.

వైఎస్సార్‌సీపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లను చీల్చడానికి చంద్రబాబు డైరెక్షన్‌లోనే జనసేన పార్టీ బీఎస్పీతో పొత్తుపెట్టుకుంది. చంద్రబాబు, నారా లోకేశ్‌లు పోటీ చేసిన కుప్పం, మంగళగిరి నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను పోటీలో నిలపలేదు. ఆ స్థానాలను మిత్రపక్షాలైన కమ్యూనిస్టు పార్టీలకు విడిచిపెట్టినట్టు కథ నడిపించారు. ఈ రెండుచోట్లా పవన్‌ ప్రచారమూ చేయలేదు. అదే విధంగా పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల తరపున చంద్రబాబూ ప్రచారం చేయలేదు. పకడ్బందీ స్కెచ్‌తో డ్రామా నడిపించారు. కానీ విజ్ఞులైన ప్రజలు వారిద్దరి డ్రామాను గుర్తించి రెండు పార్టీలను 2019లో చిత్తుగా ఓడించారు.

మళ్లీ అదే కుతంత్రం
చంద్రబాబు, పవన్‌ మరోసారి కుతంత్రానికి తెరతీశారు. టీడీపీ రాజకీయంగా ఉనికి కోల్పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని అందించారు. దీంతో బాబులో ఆందోళన తీవ్రమైంది. పొత్తులు లేకుండా చంద్రబాబు గెలవలేరు. 1999, 2014 ఎన్నికల్లో పొత్తులతోనే టీడీపీ గెలిచింది. జనసేనతో లోపాయికారీ పొత్తుపెట్టుకుని 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే 23 సీట్లే వచ్చాయి. దాంతో మరోసారి పొత్తుల ఎత్తులు వేస్తూ పవన్‌ను తెరపైకి తెచ్చారు. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే వారి కుట్రకు తెరతీశారు. బాబు, పవన్‌ తమ కుమ్మక్కు కుట్రలతో ప్రజల్ని మోసగిస్తున్నారని పరిశీలకులు విమర్శిస్తున్నారు.  

మరిన్ని వార్తలు