Pawan Kalyan: జనవాణా.. విషవాణా?

11 Jul, 2022 03:45 IST|Sakshi

వ్యక్తుల మధ్య వివాదానికి రాజకీయ రంగు పులిమిన జనసేన

టీడీపీ హయాంలోనే రద్దైన రేణిగుంట మహిళ ప్లాటు

తిరుపతి జిల్లా కలెక్టర్‌ నివేదికతో వాస్తవాలు బహిర్గతం 

సాక్షి, అమరావతి: ‘జనవాణి’ పేరిట జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విషవాణి వినిపిస్తున్నారు. అవాస్తవాలు, కట్టుకథలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరంతర ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన అనిత అనే మహిళతో ఆయన హైడ్రామా సృష్టించారు. నిరాధార ఆరోపణలతో నిందలకు దిగారు. ఈ ఉదంతంపై తిరుపతి జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి పూర్తి వివరాలను నివేదించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి గ్రామం తారకరామనగర్‌లో ప్లాటు నంబరు 2400 వెనుక వాస్తవాలను కలెక్టర్‌ నివేదిక బహిర్గతం చేస్తోంది.

కొనసాగుతున్న విచారణ..
2004లో అనిత అనే మహిళకు ఇంటిపట్టా కేటాయించిన ప్రభుత్వం 6 నుంచి 12 నెలల్లోగా ఇల్లు లేదా గుడిసె నిర్మించుకుని స్వాధీనంలో ఉంచుకోవాలని షరతు విధించింది. అదే ప్రాంతంలో గుడిసె లేదా ఇల్లు కట్టుకోని 989 మంది ప్లాట్ల లబ్ధిదారులకు 2018లో టీడీపీ హయాంలో నోటీసులు జారీ అయ్యాయి. లబ్ధిదారులనుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్లాట్లను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించారు. కాగా ప్లాటు నంబరు 2400ని వి.వెంకటేష్‌ అనే వ్యక్తికి కేటాయిస్తూ చంద్రబాబు హయాంలో తహశీల్దార్‌ ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ జారీచేశారు.

అదే సమయంలో 3 వేల మందికి ఆ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ఒకేసారి అంతపెద్ద ఎత్తున సర్టిఫికెట్లు జారీ కావడంపై చిత్తూరు కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈలోగా ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ పొందిన వెంకటేష్‌ ఆ ప్లాటులో షెడ్డు నిర్మించుకుని ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నాడు. షెడ్డు నిర్మాణ సమయంలో అనిత, వెంకటేష్‌ల మధ్య వివాదం తలెత్తింది. అనిత షెడ్డును ఆక్రమించుకోవడంతో ఆమెపై వెంకటేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆ తర్వాత అనిత నుంచి షెడ్డును స్వాధీనం చేసుకున్న వెంకటేష్‌ చుట్టూ ప్రహరీగోడను నిర్మించాడు. వెంకటేష్‌ బీసీ సామాజిక వర్గం బోయ కులానికి చెందిన వ్యక్తి. దొడ్లమిట్టలో ఓ  కూల్‌డ్రింకు షాపులో కూలీగా పని చేస్తున్న వెంకటేష్‌తో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధంలేదు. వాస్తవాలు ఇలా ఉండగా వాటిని మరుగున పరిచి ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు పవన్‌కళ్యాణ్‌ ప్రయత్నించారు. విజయవాడలో జనవాణి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఈ అంశాన్ని వీడియో తీసి అనుకూల మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంచేసి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేశారు. 

>
మరిన్ని వార్తలు