పవన్‌లో స్పష్టంగా అభద్రతా భావం.. సభ ఆద్యంతం ఆరు తిట్లు–మూడు విమర్శలు

13 Jan, 2023 14:59 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ యువశక్తి సభ ఆద్యంతం ఆరు తిట్లు–మూడు విమర్శలు అన్నట్టుగానే సాగింది. తిట్టడానికి ఈ యువశక్తి సభ కాదంటూనే సభ చివరికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, అంబటి రాంబాబు, రోజా, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిను తిడుతూనే ప్ర సంగం సాగించారు. నోటికొచ్చినట్టు దూషణ చేశా రు. తాను తిట్టొచ్చు.. ఎదుటోళ్లు తిట్టకూడదు.. తా ను విమర్శలు చేయవచ్చు.. ప్రత్యర్థులు మాట కూడా ఆడకూడదు... అన్నట్టుగానే మాట్లాడారు. తనను ఎవరైనా ఏమైనా అంటే చెప్పుతో కొట్టండని యువకులను ఉసిగొల్పారు.  

లావేరు మండలం తాళ్లపాలెంలో యువశక్తి పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు రాష్ట్ర నలు మూలల నుంచి సినిమా అభిమానంతో యువత వచ్చారు. ఉదయం 11గంటలకు సభ ప్రారంభమవుతుందని పిలుపునివ్వడంతో జనం అక్కడికొచ్చేశారు. కానీ సాయంత్రం 5.30 గంటల వరకు పవన్‌ కల్యాణ్‌ వేదికపైకి రాలేదు. అంతవరకు తరలివచ్చిన యువత అంతా వేచి చూడక తప్పలేదు. ఇక 100 మంది యువకుల వాయిస్‌ వింటామని, వారంతా మాట్లాడుతారని చెప్పినా కేవలం 20మందితో మమ అనిపించేశారు. ఆ మాట్లాడిన వారంతా ఆయా రంగాలపై అవగాహన ఉన్న వారు కాదు. జనసైనికుల మాదిరిగానే మాట్లాడారు. ప్రసంగం ప్రారంభించాక యువశక్తి కార్యక్రమంలో భాగంగా ఏం చెబుతారో అని ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రి, మంత్రులపై చేసిన తిట్లనే వినాల్సి వచ్చింది. సింగిల్‌ లైన్‌లో ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని తీసేస్తా, వలసలు ఆపుతా, పరిశ్రమలు వచ్చేలా చేస్తా, మత్స్యకారులకు జెట్టీలు నిర్మిస్తా అని చెప్పి మిగతా సమయమంతా అధికార పార్టీ నేతలను తి ట్టడమే పనిగా పెట్టుకున్నారు.     

అవసరమైతే గొడవ పడాలంటూ యువతను రెచ్చగొట్టేలా విద్వేషపూరితంగా ప్రసంగాన్ని సాగించారు. తనపై మాట్లాడే వారిపైన దాడులు చేయాలన్నట్లు సంకేతాలిచ్చారు. ఇక జిల్లా మంత్రులు ధర్మా న ప్రసాదరావు, సీదిరి అప్పలరాజులను హేళన చేస్తూ మాట్లాడారు. జిల్లాలో చేస్తున్న అభివృద్ధి పనులను ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ జిల్లాకు ఏదైనా జరిగిందంటే అదంతా తన చలవే అన్నట్టుగా ప్రసంగించారు. చివరిగా తనకు జనలొస్తారు గానీ, ఓట్లేయరంటూ తన అభిమానులపై అక్కసును వెళ్లగక్కారు. నమ్మకం లేకనే తాను పొత్తుకు వెళుతున్నానని చెప్పుకొచ్చారు. మీరేమైనా గ్యారంటీ ఇస్తారా? మీ తల్లిదండ్రులతో మాట్లాడి చెప్పండని మాట్లాడారంటే ఎంత అభద్రతా భావంతో ఉన్నారో స్పష్టంగా కనిపించింది. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నానని దానికి జన సైనికులు సిద్ధమవ్వాలనే సంకేతాన్ని చెప్పకనే చెప్పారు.  పవన్‌ ప్రసంగించిన తీరు నచ్చక చాలా మంది ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోవడం కనిపించింది. 

జెట్టీలు నిర్మిస్తాం.. 
ఎచ్చెర్ల క్యాంపస్, రణస్థలం, లావేరు, జి.సిగడాం: తాము పొత్తులతో వెళ్లి మిశ్రమ ప్రభు త్వం అధికారంలోకి వస్తే జిల్లాలో మత్స్యకారుల కోసం జెట్టీలు నిర్మిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. లావేరు మండలంలోని తాళ్లవలసలో గురువారం యు వశక్తి పేరుతో పార్టీ నాయకులు, అభిమానుల తో భారీ బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం కార్యకర్తలను ఉద్రేకపరిచేలా సాగింది. జిల్లా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజుపై విమర్శలు చేశారు. తనకు 175 నియోజకవర్గాల్లో సింగిల్‌గా పోటీ చేసే సత్తా లేదని, టీడీపీతో పొత్తు తప్పదని కార్యకర్తలకు నేరుగా చెప్పేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రలో మత్స్యకారుల వలసల నిర్మూలనకు కృషి చేస్తానన్నారు. జిల్లాకు చెందిన గిడుగు రామ్మూర్తి పంతులు వ్యావహారిక భాషోద్యమం తనకు స్ఫూర్తినిచ్చిందని, వీర గున్నమ్మ పోరాటాన్ని అంతా స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.    

చదవండి: (మీరు కలిసొచ్చినా రాజకీయంగా మరణమే: అంబటి రాంబాబు)

మరిన్ని వార్తలు