Janasena: జనసేన జేపీ నకిలీ చేష్టలు

16 Sep, 2022 19:33 IST|Sakshi

ప్రజల కోసం ప్రశ్నించే పార్టీ.. అవినీతికి తావులేని రాజకీయాలకు పనిచేసే పార్టీ తమదని హడావుడి చేసే జనసేన జెడ్పీటీసీ జయప్రకాష్‌నాయుడు అవినీతి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫోర్జరీ, బ్యాంకు గ్యారంటీలతో తెలంగాణ ప్రభుత్వాన్ని మోసం చేసి అడ్డంగా బుక్కైన జేపీ నాయుడు వ్యవహారం జిల్లా జనసేనలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో జేపీ వివాదాస్పద వ్యవహార శైలిపై సర్వత్రా చర్చ సాగుతోంది. తొమ్మిదేళ్ల్ల కాలంలో అతడిపై 9 కేసులు నమోదై కొన్ని కేసులు ముగిసిపోగా, మరికొన్ని విచారణ దశలోనూ, ఇంకొన్ని కోర్టుల్లో వివిధ దశల్లోనూ ఉన్నాయి.   

సాక్షి, ఏలూరు: తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ అక్కడ చెరువుల్లో చేప, రొయ్యల పిల్లలు పెంచడానికి వీలుగా టెండర్లు ఆహ్వానించింది. ఈ క్రమంలో భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం జెడ్పీటీసీ జయప్రకాష్‌ నాయుడు, అతని బృందం టెండ ర్లు దాఖలు చేసి దక్కించుకున్నాకా బ్యాంకు గ్యారంటీ, ఫెర్ఫార్మెన్స్‌ గ్యారంటీ పత్రాలు సమర్పించి టెండర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోని 9 జిల్లాలో జేపీ నాయుడు అండ్‌ టీం టెండర్లు దక్కించుకుంది. ఈ క్రమంలో జయప్రకాష్‌ నాయుడు పాలకొల్లులోని ఓ ప్రభుత్వ బ్యాంకు నుంచి నామమాత్రంగా బ్యాంకు గ్యారంటీలను తీసుకుని, తీసుకున్న డాక్యుమెంట్లను పూర్తిగా ఫోర్జరీ చేసి గ్యారంటీ విలువను పూర్తిగా పెంచి బ్యాంకు సిబ్బంది సంతకాలు, నకిలీ స్టాంపులతో తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించారు.

విచారణలో ఇదంతా వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం  టెండర్‌ రద్దు చేయడంతో పాటు జేపీ నాయుడు అతని బృందంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించి సీఐడీకి కేసు అప్పగించినట్టు సమాచారం. ఈ క్రమంలో జయప్రకాష్‌ నాయుడు వ్యవహార శైలి జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద వ్యక్తిగా గుర్తింపు పొందిన జేపీపై 2014 నుంచి ఇప్పటివరకు భీమవరం వన్‌టౌన్, టూటౌన్, పాలకోడేరు, వీరవాసరం పోలీస్‌స్టేషన్లల్లో 9 కేసులు నమోదయ్యాయి. వీటిలో రెండు కేసులు ముగిసిపోగా, మిగతా కేసులు వివిధ దశల్లో ఉన్నాయి. 

చదవండి: (బిగుస్తున్న ఉచ్చు.. జనసేన నాయకుడిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌)

కబ్జాలు.. హత్యాయత్నాలు 
భీమవరం 32వ వార్డులో గాదిరాజు నాగేశ్వరరాజు జగన్నాథరాజుకు చెందిన 10 సెంట్ల భవనాన్ని శ్రీరామరాజు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దీనిలో జయప్రకాష్‌నాయుడు కలు గచేసుకుని భవనం తనదేనని, యజమాని రికార్డులో తన పేరు నమోదు చేయాలని కోరారు. అయితే అప్పటికే గాదిరాజు నాగేశ్వరరాజు పేరు రికార్డుల్లో ఉండటంతో జయప్రకాష్‌ యత్నం విఫలమైంది. దీంతో నాగేశ్వరరాజు తల్లి జయప్రకాష్‌నాయుడుకు సంబంధించి వెంకటపతిరాజుకు రిజిస్ట్రేషన్‌ చేసిందని నకిలీ పత్రాలు సృష్టించి జయప్రకాష్‌ అనుచరులైన పృధ్వీరాజ్, మురళీకృష్ణలను సాక్ష్యులుగా పెట్టుకుని 2014 గణపవరం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వెంకటపతిరాజు పేరుతో రిజిస్ట్రేషన్‌కు యత్నించారు. ఈ సమాచారంతో నాగేశ్వరరాజు కోర్టులో కేసు దాఖలు చేయడంతో పాటు భీమవరం టూటౌన్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు.  

►ఇదే రీతిలో ప్రభుత్వ భూమి కబ్జాకు జేపీ ప్రత్యేక స్కెచ్‌ గీశారు. వీరవాసరంలోని 10వ వార్డుకు చెందిన వలవల రామకృష్ణ అనే వ్యక్తి 439/1 సర్వే నంబర్‌లో 34 సెంట్ల భూమి దాదాపు 45 ఏళ్లుగా తన ఆధీనంలో ఉంచుకుని సాగు చేసుకుంటూ ప్రభుత్వానికి పన్ను క డుతున్నారు. దీనిపై జేపీ టీం దృష్టి పెట్టి 2017 జూన్‌ 24న స్థలంలోకి ప్రవేశించి పాకలు వేసే ప్రయత్నం చేసి అడ్డుకోబోయిన రామకృష్ణపై దౌర్జన్యం చేశారని వీరవాసరం పోలీస్‌స్టేషన్‌లో 113/2017తో జేపీపై కేసు నమోదై కొనసాగుతోంది.  

►అలాగే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇద్దరితో కోర్టులో కేసులు వేయించి ఒకరికి అనుకూలంగా వచ్చాక ఆ భూమి తమదేనని మరొకరికి అమ్మేస్తూ అడ్డగోలు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కూడా జేపీ చేస్తున్నారు.  

►వీరవాసరానికి చెందిన కట్టా వెంకటేశ్వరరావు ఇంటి ప్రహరీ నిర్మిస్తుండగా కొందరు వ్యక్తులు వచ్చి ధ్వంసం చేయడంతో పాటు కుటుంబసభ్యులపై హత్యాయత్నం చేశారు. ఈ వ్యవహారంలో జయప్రకాష్‌నాయుడుది కీలకపాత్ర ఉందని అతనిపై క్రైం నంబర్‌ 157/2022 కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు.  

మరిన్ని వార్తలు