జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్‌రెడ్డి 

17 Nov, 2021 02:57 IST|Sakshi
జవహర్‌రెడ్డి, జె.శ్యామలరావు

ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలరావు 

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా సురేష్‌కుమార్‌ 

రాష్ట్రంలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీ  

సాక్షి, అమరావతి: టీటీడీ ఈవోగా పనిచేస్తున్న డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డిని ప్రభుత్వం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. టీటీడీ ఈవో అదనపు బాధ్యతలు ఆయనకే అప్పగించింది. రాష్ట్రంలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జె.శ్యామలరావు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఉన్న సతీష్‌చంద్ర ఈ నెలాఖరులో రిటైర్‌ అయ్యాక ఆ బాధ్యతలను పూర్తిస్థాయిలో శ్యామలరావు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ, ఇంధనశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జి.సాయిప్రసాద్‌ క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆ బాధ్యతలను అదనంగా నిర్వర్తిస్తున్న రజత్‌భార్గవను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. పరిశ్రమలు, వాణిజ్యశాఖ (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనాను ఆర్థికశాఖ కొత్తగా ఏర్పాటుచేస్తున్న వాణిజ్యపన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టుకు బదిలీ చేశారు. ఇప్పటివరకు డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులో పనిచేసి వెనక్కి వచ్చిన ఎస్‌.సురేష్‌ కుమార్‌ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా నియమితులయ్యారు.

ఆ స్థానంలో ఉన్న వి.చినవీరభద్రుడిని గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఉన్న రంజిత్‌బాషాను సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శిగా బదిలీ చేశారు. యువజన వ్యవహారాల డైరెక్టర్, ఏపీ స్టెప్‌ ఎండీ సి.నాగరాణిని చేనేతశాఖ డైరెక్టర్‌గా నియమించారు. ఆప్కో ఎండీగా అదనపు బాధ్యతలు ఆమెకే అప్పగించారు. చేనేత డైరెక్టర్‌ అర్జునరావును బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఇప్పటివరకు ఆ పోస్టు అదనపు బాధ్యతలు చూస్తున్న అనంతరామును రిలీవ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు