నేడు జవాన్‌ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి అంత్యక్రియలు

11 Nov, 2020 09:16 IST|Sakshi

అర్ధరాత్రి  అనంతరం గ్రామానికి చేరిన వీరజవాన్‌ భౌతికకాయం 

కన్నీరుమున్నీరైన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబసభ్యులు 

నేడు మిలటరీ లాంఛనాలతో అంత్యక్రియలు 

సాక్షి, చిత్తూరు(యాదమరి) : ఉగ్రదాడిలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీరజవాను ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి భౌతికకాయం మంగళవారం అర్ధరాత్రి అనంతరం ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చేరింది. ఆదివారం జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో పాల్గొన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అమరుడైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరజవాను భౌతికకా యం కోసం బంధువులు, గ్రామస్తులు, అధికారులు నిరీక్షించారు. మంగళవారం అర్ధరాత్రి అనంతరం భౌతికకాయం స్వగ్రామానికి చేరడంతో నిద్రాహారాలు మాని ఎదురుచూస్తున్న గ్రామం ఒక్కసారిగా దుఃఖ సాగరమైంది. ప్రవీణ్‌ మృతదేహాన్ని చూడగానే భార్యాపిల్లలు, తల్లిదండ్రులు, బంధువులే కాకుండా ఇరుగుపొరుగు గ్రామాల వారు సైతం తీవ్రభావోద్వేగంతో కదలిపోయారు. మిలటరీ అధికారులు వారి ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రవీణ్‌ జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు.   చదవండి:   (ఉగ్రపోరులో చిత్తూరు జిల్లా కమాండో వీరమరణం)

వాతావరణం సరిగా లేక.. 
ఉగ్రదాడిలో పాట్నాకు చెందిన కెప్టెన్‌ ఆశుతోష్, తెలంగాణకు చెందిన రెడ్యా మహేష్, ఆంధ్రాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అమరులైన విషయం తెలిసిందే. వీరి భౌతికకాయాలను జమ్ముకాశ్మీర్‌ నుంచి ఢిల్లీలోని మిలటరీ కార్యాలయానికి తరలించారు. భౌతిక కాయాలపై కల్నల్‌ సుధీరా, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అశ్విన్‌ పుష్పగుచ్ఛాలు ఉంచి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక విమానంలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మృతదేహాన్ని రేణిగుంట విమానాశ్రయానికి, అక్కడి నుంచి మిలిటరీ వాహనంలో రెడ్డివారిపల్లెకు తరలించారు. అప్పటికి సమయం అర్ధరాత్రికి పైగా దాటింది. మృతదేహంతో పాటు నాసిక్‌ యూనిట్‌ నుంచి 31 మంది ఆర్మీ సిబ్బంది ప్రత్యేక విమానంలో వచ్చారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మృతదేహం తరలింపులో ఆలస్యం చోటు చేసుకుందని, విమానం సాయంత్రం ఆరు గంటల తర్వాత బయలుదేరిందని మిలటరీ అధికారులు తెలిపారు.     చదవండి: (ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షలు)

నేడు దహనక్రియలు 
వీరజవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భౌతికకాయానికి బుధవారం దహనక్రియలు జరుగనున్నాయి. మిలటరీ సిబ్బంది గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ నిర్వహించనున్నారు. బెంగళూరు నుంచి వచ్చే జెపీఎఫ్‌–9 మేజర్‌ నిర్బయ్‌ బండాకర్, మిలటరీ అధికారులు పకృద్ధీన్, హేమాద్రి గౌరవ వందనం అనంతరం దహనక్రియలు చేయనున్నట్లు మిలటరీ అధికారులు చెప్పారు. 

మరిన్ని వార్తలు