కొత్త జిల్లాల ఏర్పాటు మంచి నిర్ణయం: జేపీ

3 Jul, 2022 05:11 IST|Sakshi

ఒంగోలు మెట్రో: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మంచి నిర్ణయమని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఎన్‌.జయప్రకాష్‌ నారాయణ ప్రశంసించారు. ప్రకాశం జిల్లా నామకరణ స్వర్ణోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని చెన్నపురి తెలుగు అకాడెమీ ఆధ్వర్యంలో డాక్టర్‌ తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో వెలువరించిన ‘స్వర్ణ ప్రకాశం’, ‘ప్రకాశం జిల్లా సాహిత్య చరిత్ర’, ‘ఒంగోలు గురించి ఒకింత’ తదితర పుస్తకాల ఆవిష్కరణ సభ శనివారం ఒంగోలు ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ‘స్వర్ణ ప్రకాశం’ పుస్తకాన్ని జయప్రకాష్‌ నారాయణ ఆవిష్కరించి ప్రసంగించారు. కేవలం కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆగిపోకూడదని, అధికార వికేంద్రీకరణ, పాలన వికేంద్రీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటుకు వెలకట్టే సమాజం బాగుపడదని, ఓటుకు, నిరసనకు మధ్య పరిమితమైతే అది బూటకపు ప్రజాస్వామ్యమవుతుందన్నారు. కాగా, ఉన్నం జ్యోతివాసు రచించిన ‘ప్రకాశం జిల్లా సాహిత్య చరిత్ర’, మారేపల్లి సూర్యకుమారి రచించిన ‘ఒంగోలు గురించి ఒకింత’ పుస్తకాలను ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు.  

మరిన్ని వార్తలు