‘జయలక్ష్మి’ లెక్క రూ.560 కోట్లు

29 Aug, 2022 05:11 IST|Sakshi
కాకినాడ సర్పవరం జంక్షన్‌ వద్ద జయలక్ష్మి సొసైటీ మెయిన్‌ బ్రాంచ్‌

29 బ్రాంచీల్లో ఖాతాల పరిశీలన

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 వేల మంది బాధితులు

సహకార కమిషనర్‌కు కమిటీ నివేదిక

కొత్త పాలక వర్గానికి అక్టోబర్‌ 9న ఎన్నిక

సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టి బోర్డు తిప్పేసిన కాకినాడది జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్‌ మల్టీపర్పస్‌ (ఎంఏఎం) కో ఆపరేటివ్‌ సొసైటీ పాలకవర్గం అవినీతి లెక్క తేలింది. డిపాజిటర్ల సొమ్ము సుమారు రూ.560 కోట్ల మేర దారి మళ్లించినట్లు వెల్లడైంది. జయలక్ష్మి పాలకవర్గం అక్రమాల బాగోతాన్ని సహకార శాఖ అధికారుల బృందం నిగ్గు తేల్చింది. దాదాపు మూడు నెలలకుపైగా రాష్ట్రవ్యాప్తంగా 29 బ్రాంచీల్లో ఖాతాలను పరిశీలించి తుది నివేదికను సహకార శాఖ కమిషనర్‌ బాబు అహ్మద్‌ పరిశీలనకు పంపారు.

వడ్డీ ఎరవేసి..
ఆకర్షణీయంగా 12.5 శాతం వడ్డీని ఎర వేయడంతో జయలక్ష్మి సొసైటీ బ్రాంచిల్లో సుమారు 20 వేల మంది రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, సీనియర్‌ సిటిజన్లు, మహిళలు రూ.కోట్లలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశారు. గడువు తీరినా డబ్బులు చెల్లించకపోవడంతో జయలక్ష్మి సొసైటీ బాగోతం గత ఏప్రిల్‌ 6న వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదులతో చైర్మన్‌ ఆంజనేయులు, వైస్‌ చైర్‌పర్సన్‌ విశాలాక్షి తదితరులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

పోలీసులతో పాటు సీబీసీఐడీ పోలీసులు కూడా విచారణ చేపట్టారు. బాధితుల ఆక్రందన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఉమామహేశ్వరరావు, నలుగురు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లతో కూడిన కమిటీ ఏప్రిల్‌ 20 నుంచి విచారణ చేపట్టి అనేక అవకతవకలు గుర్తించింది. చైర్మన్‌ ఆంజనేయులు, వైస్‌ చైర్‌పర్సన్‌ విశాలాక్షి కనుసన్నల్లోనే ఈ మొత్తం కుంభకోణం జరిగినట్టు నివేదికలో పొందుపరిచారు.

డిపాజిటర్ల ఖాతాల నుంచి రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకూ వైస్‌ చైర్‌పర్సన్, కుటుంబ సభ్యుల పేరిట మళ్లించిట్టు కమిటీ తేల్చింది. రుణాలకు ఎటువంటి హామీ పత్రాలూ లేవు. ఆంజనేయులుకు వరుసకు మేనల్లుడు అయిన ఓ వ్యక్తికి ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ.70 కోట్ల వరకూ డబ్బులు మళ్లించారు. మరోవైపు పాలకవర్గంలో మెజారిటీ సభ్యులు డిపాజిటర్ల సొమ్ములను సొంతానికి వాడుకున్నారు.

మరి కొందరికి ఎలాంటి హామీ లేకుండా రూ.200 కోట్ల వరకూ బదలాయించినట్టు గుర్తించారు. వైస్‌ చైర్‌పర్సన్‌ సమీప బంధువుకు సినిమా నిర్మాణం పేరుతో హామీ లేకుండా రూ.50 కోట్లు ఇచ్చేశారు. సర్పవరం మెయిన్‌ బ్రాంచి లెడ్జర్‌లో కొన్ని పేజీలు మాయమయ్యాయని నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం.

అక్టోబరు 9న పాలకవర్గ ఎన్నికలు
సహకార శాఖ గత నెల 23న జయలక్ష్మి సొసైటీకి అడ్‌హాక్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ స్థానంలో కొత్త పాలకవర్గం ఎన్నిక జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు అడ్‌హాక్‌ కమిటీ చైర్మన్‌ సుబ్బారావు ప్రొసీడింగ్స్‌ ఇచ్చి ఎన్నికల అధికారిగా రిటైర్డ్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆర్‌ఎస్‌ సుధాకర్‌ను నియమించారు.

బోర్డు డైరెక్టర్లు, ఆఫీసు బేరర్ల నియామకానికి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అక్టోబరు 9న పాలకవర్గ ఎన్నిక నిర్వహించి మర్నాడు ఫలితాలు ప్రకటిస్తారు. ఏకగ్రీవం అయితే అక్టోబర్‌ 2న పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. లేకపోతే 9న పోలింగ్‌ నిర్వహిస్తారు. జయలక్ష్మి సొసైటీ కుంభకోణంపై కొత్తగా ఎన్నికయ్యే పాలకవర్గం చర్చించి డిపాజిటర్లకు అండగా నిర్ణయం తీసుకోనుంది.

విచారణ పూర్తి
జయలక్ష్మి సొసైటీలో జరిగిన అవకతవకలపై నివేదికను ఉన్నతాధికారులకు పంపించాం. కొత్త పాలకవర్గం ఎన్నికకు అడ్‌హాక్‌ కమిటీ చైర్మన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఏకగ్రీవం కాకుంటే పోలింగ్‌ నిర్వహిస్తాం.
– ఆర్‌.దుర్గాప్రసాద్, జిల్లా సహకార అధికారి, కాకినాడ 

మరిన్ని వార్తలు