అలజడులు సృష్టించేందుకు జేసీ బ్రదర్స్‌ యత్నం..  

7 Nov, 2022 08:48 IST|Sakshi

తాడిపత్రి అర్బన్‌: తాడిపత్రి... ఈ పేరు వింటే ఒకప్పుడు ఫ్యాక్షన్‌ హత్యలు.. ముఠా పోరు.. విధ్వంసాలు.. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా దాడులు.. ప్రతీకార జ్వాలల్లో దహనమయ్యే గడ్డి వాములు, గుడిసెలు, గృహాలు కళ్ల ముందు మెదలాడుతాయి. ఆధిపత్య పోరులో ఓ వర్గం సాగించిన దౌర్జన్యానికి మూడు దశాబ్దాలుగా తాడిపత్రి పోలీస్‌ సబ్‌ డివిజన్‌ అతలాకుతలమైంది.

తాడిపత్రి నియోజకవర్గంలో ఏ ఎన్నికల చరిత్ర చూసినా పచ్చని పల్లెల్లో అల్లకల్లోలమే ఆవిష్కృతమవుతుందనేది బహిరంగ రహస్యం. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేశారు. పోలీసు యంత్రాంగానికి పూర్తీ స్వేచ్ఛనిచ్చారు. దీంతో  తాడిపత్రిపై ఇప్పటి వరకూ పడిన ఫ్యాక్షన్‌ ముద్ర కాస్త చెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గంలో నెలకొన్న స్వేచ్ఛాయుత వాతావరణాన్ని చెడగొట్టి తమ ఆధిపత్యాన్ని కొనసాగించేలా జేసీ సోదరులు గ్రామాల్లో అలజడులు సృష్టించేందుకు తెరలేపారు. ఇందుకు ఇటీవల జేసీ సోదరుల సొంతూరు జూటూరులో జరిగిన దాడులే నిదర్శనం.  

జేసీ బ్రదర్స్‌ అడ్డాగా.. 
తాడిపత్రి పేరు వినగానే స్ఫురణకు వచ్చే పేరు జేసీ బ్రదర్స్‌ . 1982లో సమితి ప్రెసిడెంట్‌గా జేసీ దివాకర్‌రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి మండలాల్లోని పలు గ్రామాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఫ్యాక్షన్‌కు బీజం వేశారు. తాడిపత్రి మండలం హుసేనాపురంలో గృహ దహనాలు, పెద్దపప్పూరు మండలం తురకపల్లి, తాడిపత్రి మండలం వెలమకూరు గ్రామాల్లో హత్యోదంతాలు, ఇతర గ్రామాల్లో జరిగిన ఫ్యాక్షన్‌ గొడవల్లో జేసీ సోదరుల ప్రమేయం ఉందన్న ఆరోపణలే ఇందుకు నిదర్శనం. 

1985లో జరిగిన సాధారణ ఎన్నికల్లో  పెద్దపప్పూరు మండలంలోని పసులూరు గ్రామంలో మహిళల పోలింగ్‌ కేంద్రంలోకి జేసీ వర్గీయులు చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. దీనిపై అప్పటి పోలింగ్‌ విధుల్లో ఉన్న  విశ్రాంత సైనికోద్యోగి ఫిర్యాదు మేరకు అప్పటి ఎన్నికల ఇన్‌చార్జ్‌ దోతాంగే (ఐపియస్‌ అధికారి)..  జేసీ దివాకర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత దీనిపై ఎలాంటి చర్యలూ లేవు. పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ కలి్పంచక పోవడంతోనే అప్పట్లో జేసీ సోదరుల ఆగడాలు పెచ్చరిల్లిపోయాయన్న విమర్శలు వినిపించాయి. 2004 నుంచి హ్యాట్రిక్‌ విజయాలతో తాడిపత్రి అడ్డాగా కొనసాగుతున్న జేసీ సోదరుల ఆధిపత్యానికి 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయంతో చుక్కెదురైంది.  

సేవ్‌ తాడిపత్రి పేరుతో హైడ్రామా.. 
మూడు దశాబ్దాలుగా జేసీ సోదరుల ఆగడాలతో తాడిపత్రి వాసులు విలవిల్లాడారు. గ్రానైట్, ట్రాన్స్‌పోర్టు, మట్కా, పేకాట, కాంట్రాక్టులు, సిమెంటు ఫ్యాక్టరీలు... ఒకటేమిటీ తాడిపత్రిలో ప్రతిదీ ఆదాయ వనరుగా మార్చుకుని, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ప్రతి ఒక్కరూ వీరికి కప్పం చెల్లించారు. కాదని ఎదురు మాట్లాడిన వారి ఇంటికి కరెంటు, నీటి సరఫరా నిలిపి వేశారు. మున్సిపాలిటీ వాహనంలో చెత్త తీసుకొచ్చి వారి ఇంటి ముందు పోసి కక్షసాధింపులకు దిగేవారు. అద్దె ఇంట నివాసమున్న వారిని తక్షణమే ఖాళీ చేయించేవారు. 

అధికారం కోల్పోయిన తర్వాత జేసీ సోదరుల నోటి నుంచి వెలువడుతున్న మాటలు, వారు ఉపయోగించిన భాషను చూసి ప్రతి ఒక్కరూ ఛీదరించుకున్నారు. ఈ క్రమంలోనే తిరిగి తమ పట్టు నిలుపుకునేందుకు తాజాగా ‘సేవ్‌ తాడిపత్రి’ పేరుతో జేసీ ప్రభాకరరెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారు. పేరుకు సేవ్‌ తాడిపత్రి అయినా.. దీని వెనుక ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు జేసీ ప్రభాకరరెడ్డి సాగిస్తున్న ప్రయత్నాలను తాడిపత్రి వాసులు పసిగట్టారు.   

జేసీ సోదరుల ఆగడాలపై పెద్దారెడ్డి పోరు.. 
తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జేసీ సోదరుల ఆగడాలపైనే పోరుబాట సాగిస్తూ వచ్చారు. దీంతో పెద్దారెడ్డిని అప్పట్లో ఇబ్బందులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అక్రమంగా కేసులు మోపి, జైలుకు పంపించేందుకు ప్రయత్నించారు. అయినా పెద్దారెడ్డి వెనుకడుగు వేయక  అలుపెరుగని పోరాటం చేశారు. ఇదే క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జేసీ సోదరులకు తగిన గుణపాఠం చెప్పి కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎమ్మెల్యేగా పట్టం కట్టారు.  

మరిన్ని వార్తలు