Blackmail Politics: నేనింతే.. మారనంతే!

11 Nov, 2021 10:54 IST|Sakshi

 బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు వీడని జేసీ  

అధికారులను భయపెట్టేందుకు కుటిల యత్నాలు

తాడిపత్రి మున్సిపల్‌ కమిషనర్‌ను టార్గెట్‌ చేసిన వైనం

మున్సిపల్‌ కార్యాలయంలోనే అనుచరులకు చాంబర్‌

ఆగడాలు తాళలేక సెలవుపై వెళ్లేందుకు సిద్ధమైన సిబ్బంది

జేసీ ప్రభాకర్‌రెడ్డి తీరు మారలేదు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ దౌర్జన్యాలు, బరితెగింపులతో తనకడ్డే లేనట్లు ప్రవర్తించారు. అధికారులను భయకంపితులను చేశారు. ఈ ఆగడాలు తాళలేని ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. ఇప్పుడైనా తీరు మార్చుకున్నారా అంటే అదీ లేదు. ఉన్నతాధికారులను సైతం బ్లాక్‌మెయిల్‌ చేస్తూ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  

తాడిపత్రి: ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారశైలి. మున్సిపాలిటీలో ప్రాభవాన్ని కోల్పోతున్నానన్న భావనతో అధికారులను, సిబ్బందిని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారు. ప్రొటోకాల్‌ పేరుతో భయకంపితులను చేస్తున్నారు. మున్సిపాలిటీలో వ్యవహారాలన్నీ తన కనుసన్నల్లోనే జరగాలని, అధికారులందరూ తాను చెప్పినట్లే వినాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి అహంకార ధోరణితో మున్సిపల్‌ కమిషనర్‌ మొదలు కింది స్థాయి సిబ్బంది వరకూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలు పక్కనే చైర్మన్‌కు కేటాయించిన గది, ఇటీవల జేసీ ఆక్రమించుకుని నేమ్‌బోర్డు వేయించుకున్న డీఈ చాంబర్‌ 

ఉన్నతాధికారికి బెదిరింపులు  
ఈ నెల ఒకటోతేదీ మున్సిపల్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు. ఆ సమయంలో అక్కడున్న వలంటీర్లనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన కొద్దిసేపటికే కార్యాలయంలోని ఉద్యోగులకు ఫోన్‌ చేసిన జేసీ.. ఏ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే పెద్దారెడ్డికి కుర్చీలు వేసి కూర్చోబెట్టారని ప్రశ్నించారు.

కొద్దిసేపటికే అనుచరులతో మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకుని సిబ్బందిని దూషిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. లీగల్‌ నోటీసులు ఇస్తానంటూ ఉన్నతాధికారి అయిన కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌రెడ్డిని కూడా బెదిరించారు. కార్యాలయంలోని పరిపాలనా విభాగాల్లోకి వెళ్లి సిబ్బందిపైనా నోరుపారేసుకున్నారు. ఈ క్రమంలోనే కమిషనర్‌ జోక్యం చేసుకుని చీటికిమాటికి తమ విధులకు ఆటంకం కల్గించడం సరికాదని హితవు చెప్పారు. 

అనుచరుల కోసం చాంబర్‌!  
మున్సిపల్‌ చైర్మన్‌ హోదాను అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ఏ మున్సిపాలిటీలోనూ లేని విధంగా రెండు చాంబర్లను ఆక్రమించుకున్నారు. అధికారుల వద్ద ఉండాల్సిన చాంబర్ల తాళాలను కూడా తన వద్దనే ఉంచుకుంటున్నారు. దీంతో    బయటి వ్యక్తులు చాంబర్లకు వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్‌ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుచరులు కొందరు నిత్యం కార్యాలయంలోనే తిష్టవేసి కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నట్లు వాపోతున్నారు. జేసీ విపరీత పోకడలను తాళలేని సిబ్బంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.   

బెదిరించడం తగదు 
బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఒంటెద్దు పోకడలతో అధికారులను బెదిరించడం తగదు. అధికారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసే అవకాశం కల్పించాలి. అప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి. సిబ్బందికి సహాయ సహకారాలు అందిస్తే మరింత మెరుగ్గా విధులు నిర్వర్తించే వీలుంటుంది.  
– నరసింహప్రసాద్‌ రెడ్డి,మున్సిపల్‌ కమిషనర్, తాడిపత్రి  

మరిన్ని వార్తలు