జీవో నంబర్‌ 1 సరైనదే.. జేడీ వీవీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

14 Jan, 2023 10:05 IST|Sakshi

కంచిలి/కాశీబుగ్గ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1 సరైనదేనని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కంచిలిలో విలేకరులతో మాట్లాడారు. రోడ్ల మీద సభలు, రోడ్‌షోలు నిర్వహించే సందర్భాల్లో అనువైన స్థలాలను అంచనా వేసేందుకు పోలీసుల అనుమతిని తప్పనిసరి చేస్తూ అమలు చేస్తున్న జీఓ మంచిదని అన్నారు. ఇటీవల జరిగిన  ఘటనల దృష్ట్యా ఈ జీఓను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే, దీన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని తెలిపారు. అధికార పార్టీకి ఒక విధంగా, ప్రతిపక్ష, విపక్ష పార్టీలకు ఒక విధంగా అమలు చేయకూడదని సూచించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోందని, తాను మాత్రం అలా భావించడం లేదన్నారు. ఎన్నికల నియమావళిలో కూడా సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం ముఖ్యమని, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం వంటి చిన్న రాష్ట్రాల డిమాండ్‌ సరైంది కాదన్నారు. ఏపీ రీ ఆర్గనైజేషన్‌ యాక్టు ప్రకారం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.జగదీష్‌ పట్నాయక్, మునకాల కృష్ణమూర్తి, సాహుకారి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ పనితీరు భేష్‌.. 
శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ చూస్తుంటే ఆనందంగా ఉందని, ఉద్దానం కిడ్నీ రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేపడుతున్నందుకు ప్రభుత్వ పనితీరును మెచ్చుకుంటున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో పద్మనాభపురం వద్ద నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిని సందర్శించారు. ఇక్కడి కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదని, వైఎస్‌ జగన్‌ సీఎం అయిన వెంటనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఉద్దానంలో ఇంటింటికీ శుద్ధజలం అందించేందుకు రూ.700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించడం గొప్ప పని అన్నారు.  ఆయన దత్తత తీసుకున్న సహలాలపుట్టుగను సందర్శించారు. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజుతో ఫోన్‌లో మాట్లాడి ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు.

మరిన్ని వార్తలు