జేఈఈ మెయిన్‌ రిజిస్ట్రేషన్లు 21.75 లక్షలు

6 Feb, 2021 03:43 IST|Sakshi

4 దశల పరీక్షల విధానంతో పెరిగిన సంఖ్య

అభ్యర్థులు ఒకటికి మించి రాసేందుకు వీలుగా దరఖాస్తు

12 ప్రాంతీయ భాషల్లో రాసేందుకు అవకాశం

ఆంగ్లంలో పరీక్ష రాసేందుకే 94 శాతం మంది మొగ్గు

తెలుగులో పరీక్ష రాసేందుకు ఆప్షన్‌ ఇచ్చిన వారు 371 మందే

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) తదితర విద్యా సంస్థల్లోకి ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌కు ఈ విద్యా సంవత్సరంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసే సమయానికి 21,75,183 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్‌కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా కేంద్రం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో జేఈఈలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా జేఈఈ పరీక్షలను 4 దశల్లో నిర్వహించే విధానం వల్ల విద్యార్థులు దీన్నొక అవకాశంగా మల్చుకోవడానికి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపించారని తాజా రిజిస్ట్రేషన్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు 
దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగేసి రోజుల చొప్పున ఉదయం, సాయంత్రం 2 సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈసారి జేఈఈ మెయిన్స్‌ను ఇంగ్లిష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, అస్సామి భాషల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఆ భాషతో పాటు ఆంగ్లంలో కూడా ఉంటాయి. çఇప్పటివరకు 21 లక్షల మంది రిజిస్టర్‌ అవ్వగా, వారిలో 1,49,597 మంది 10 స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు మొదటిసారి ఆప్షన్‌ ఇచ్చినట్లు ఎన్‌టీఏ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో సగం మంది హిందీని ఎంచుకున్నారు. గుజరాతీలో రాసేందుకు 44,094 మంది, బెంగాలీలో రాసేందుకు 24,841 మంది ఆప్షన్లు ఇచ్చారు. అయితే అత్యధికులు ఆంగ్లంలోనే పరీక్ష రాసేందుకు ఆప్షన్‌ ఇవ్వడం గమనార్హం. 

మొదటి దశ పరీక్షకు 6.6 లక్షల మంది దరఖాస్తు 
జేఈఈ మెయిన్స్‌ను నాలుగు దశల్లో నిర్వహించేందుకు నిర్ణయించడంతో అభ్యర్థులు వారికి నచ్చిన దశలో పరీక్ష రాయనున్నారు. తొలిదశ పరీక్షలకు 6,61,761 మంది దరఖాస్తు చేశారు. కొందరు నాలుగు దఫాలు రాయడానికి దరఖాస్తు చేయగా, కొందరు ఒకటి, రెండు దఫాల్లో పరీక్షలు రాసేందుకు వీలుగా దరఖాస్తు చేశారు. 

మరిన్ని వార్తలు