జేఈఈ మెయిన్‌–2022 నిబంధనల్లో మార్పులు.. నెగెటివ్‌ మార్కులతో జాగ్రత్త!

9 Jun, 2022 05:29 IST|Sakshi

మలివిడత జేఈఈ దరఖాస్తుకు గడువు జూన్‌ 30 

సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌–2022 నిబంధనల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్పు చేసినందున విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

జేఈఈ మెయిన్‌లో అన్ని సెక్షన్ల ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ను అమలు చేయనున్నామని ఎన్‌టీఏ ఇంతకు ముందే ప్రకటించి ఉన్నందున అభ్యర్థులు సరైన సమాధానాలను మాత్రమే గుర్తించాలని, తప్పుడు సమాధానాలు గుర్తిస్తే మార్కుల్లో కోత పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. గతంలో సెక్షన్‌–ఎ లోని బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్‌ మార్కులుండేవి.

ఈసారి సెక్షన్‌–బి లోని న్యూమరికల్‌ వేల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్‌ మార్కులుంటాయని ఎన్టీఏ స్పష్టం చేసింది. బీఈ, బీటెక్‌తో పాటు బీఆర్క్‌కు సంబంధించిన పేపర్‌ 2ఏలోని సెక్షన్‌–బిలో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్‌ మార్కు ఉంటుంది.

ప్రశ్నల్లో విద్యార్థులకు చాయిస్‌
కరోనా కారణంగా కాలేజీలు ఆలస్యంగా తెరచుకోవడంతో 2021–22 విద్యా సంవత్సరంలోనూ పలు రాష్ట్రాల ఇంటర్‌ బోర్డులు సిలబస్‌ను కుదించాయి. అయితే ఎన్టీఏ సిలబస్‌ కుదించలేదు. అయితే విద్యార్థులకు ఉపశమనంగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. పేపర్‌1, పేపర్‌ 2ఏ, 2బీ విభాగాల్లో పార్టు1లలోని ప్రశ్నల్లో చాయిస్‌ను ఇచ్చింది.

ఆయా విభాగాల్లో తమకు వచ్చిన ప్రశ్నలకు విద్యార్థులు జవాబు ఇవ్వవచ్చు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా ఉంటాయి. ప్రాంతీయ భాషా ప్రశ్న పత్రాలు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే అందిస్తారు. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్‌ తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు ఇస్తారు.

టై బ్రేకర్‌ నిబంధనల్లోనూ మార్పు
ఈసారి టై బ్రేకర్‌ నిబంధనల్లోనూ మార్పులు జరిగాయి. సమానమైన స్కోరు సాధించిన వారి విషయంలో వయసును కూడా ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2021లో ఈ పద్ధతిని రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ అమల్లోకి తెచ్చింది. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులుంటే మొదట స్కోర్‌ల వారీగా వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

అనంతరం తప్పుడు సమాధానాల నిష్పత్తిని అవే సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో ఉంటే వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ముందస్తు దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తారు.

ఏపీ నుంచి 1.60 లక్షల మంది హాజరు
జేఈఈ మెయిన్‌ను 2021లో నాలుగు విడతలుగా నిర్వహించగా ఈసారి రెండు విడతలకే పరిమితం చేశారు. తొలి విడత  ఈనెల 20 నుంచి 29 వరకు, మలివిడత జూలై 21 నుంచి 30 వరకు జరుగుతుంది. ఈనెల 1 నుంచి ప్రారంభమైన మలివిడత దరఖాస్తు ప్రక్రియ 30వ తేదీతో ముగియనుంది. తొలి విడతకు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది వరకు హాజరవుతారని భావిస్తున్నారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది మెయిన్‌ రాసే అవకాశం ఉంది.

చిరునామా ఆధారంగా పరీక్ష కేంద్రం కేటాయింపు
ఈసారి అభ్యర్థి చిరునామాను అనుసరించి మాత్రమే సమీపంలోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశమిచ్చిన ఎన్టీఏ.. వాటిలో ఒకదానిని కేటాయిస్తుంది. గతంలో ఇతర రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలను కూడా ఎంపిక చేసుకొనే విధానముండేది.

అయితే 2021 మెయిన్‌లో కొందరు అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొని అక్రమాలకు పాల్పడడం, మాస్‌ కాపీయింగ్‌ జరగడంతో సీబీఐ విచారణ, అరెస్టులు కూడా చోటుచేసుకున్నందున ఈసారి ఆ విధానాన్ని మార్చారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 334 నుంచి 514కు ఎన్టీఏ పెంచింది. ఆంధ్రప్రదేశ్‌లో 29 పరీక్ష కేంద్రాల్లో ఈ జేఈఈ మెయిన్స్‌ పరీక్షను నిర్వహించనున్నారు. 

పరీక్ష కేంద్రాలు ఇవీ
అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం  

మరిన్ని వార్తలు