జాగ్రత్తల నడుమ జేఈఈ మెయిన్స్, నీట్‌ పరీక్షలు 

27 Aug, 2020 04:49 IST|Sakshi

జేఈఈ మెయిన్స్, నీట్‌ పరీక్షలు 

సాక్షి, అమరావతి:  ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర విద్యాసంస్థలతో పాటు ఎంబీబీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్స్, నీట్‌ పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్‌టీఏ) ప్రకటించింది. కోవిడ్‌–19 నేపథ్యంలో విద్యార్థులెవరికీ ఇబ్బందులు తలెత్తకుండా అనేక చర్యలు చేపడుతున్నామని పేర్కొంది. ఈ పరీక్షల నిర్వహణ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా కోవిడ్‌ ప్రోటోకాల్‌ నిబంధనలు పాటిస్తూ సహకారం అందించాలని కోరింది. ఈ మేరకు ఎన్‌టీఏ తాజాగా ప్రకటన జారీ చేసింది. జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు సెప్టెంబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు, నీట్‌ (అండర్‌ గ్రాడ్యుయేట్‌) పరీక్ష సెప్టెంబర్‌ 13న నిర్వహించేందుకు ఎన్టీఏ షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో అవసరమైన కసరత్తును ఎన్టీఏ చేపట్టింది. 

భౌతిక దూరం పాటించేలా..
► జేఈఈ (మెయిన్‌), నీట్‌ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే 99 కంటే ఎక్కువ శాతం మంది అభ్యర్థులకు తొలి ప్రిఫరెన్స్‌ కింద వారు కోరుకున్న పరీక్ష కేంద్రాన్ని ఎన్టీఏ కేటాయించింది. 
► పరీక్ష కేంద్రాల సంఖ్యను జేఈఈ మెయిన్స్‌కు 570 నుంచి 660కు, నీట్‌ కేంద్రాలను 2,546 నుంచి 3,843కు పెంచారు. 
► జేఈఈలో షిఫ్ట్‌ల సంఖ్య గతంలో 8 కాగా.. 12కు పెంచారు. అభ్యర్థుల సంఖ్య షిఫ్ట్‌కు అంతకుముందు 1.32 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు 85 వేలకు తగ్గించారు. 
► జేఈఈ మెయిన్‌కు 8.58 లక్షల మంది, నీట్‌కు 15.97 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.  
► భౌతిక దూరం పాటించేందుకు వీలుగా పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచారు. 
► జేఈఈ పరీక్ష కేంద్రాల లోపల నిర్ణీత భౌతిక దూరం ఉండేలా అభ్యర్థులకు దూరదూరంగా సీట్లు ఉంటాయి. 
► నీట్‌ పరీక్ష కేంద్రాల్లో ఒక్కో గదిలో గతంలో 24 మంది అభ్యర్థులను అనుమతించగా.. ఇప్పుడు 12కు తగ్గించారు. 
► పరీక్ష హాళ్లలో భౌతిక దూరాన్ని పాటించేందుకు అభ్యర్థుల ప్రవేశ,  నిష్క్రమణ ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు చేపడుతున్నారు. 
► పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు నిర్దేశిత నిబంధనలు అనుసరించడంలో అభ్యర్థులు, తల్లిదండ్రులు సహకరించాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు