సివిల్స్‌ అభ్యర్థులకు సడలింపులు లేవు

11 Feb, 2022 05:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితి, ఇతరత్రా ఎలాంటి సడలింపులు ఇచ్చే ప్రతిపాదన లేదని పీఎంవో శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ గురువారం రాజ్యసభలో చెప్పారు. కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో 2020లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అదనపు అటెంప్ట్స్‌కు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరిందా అన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.

ఆన్‌లైన్‌ క్రీడల క్రమబద్ధీకరణపై అధ్యయనం
దేశంలో ఆన్‌లైన్‌ ఫాంటసీ క్రీడల ప్లాట్‌ఫామ్‌ల క్రమబద్ధీకరణకు జాతీయ స్థాయిలో అమలు చేయాల్సిన మార్గదర్శకాలపై నీతి ఆయోగ్‌ రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలపై వివిధ మంత్రిత్వ శాఖలు అధ్యయనం చేస్తున్నట్లు క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌.. విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 

ఈఎస్‌ఐ ఆస్పత్రి టెండరు జారీకాలేదు
ఆంధ్రప్రదేశ్‌లో రూ.384.26 కోట్లతో నిర్మించతలపెట్టిన ఈఎస్‌ఐ ఆస్పత్రికి సంబంధించి టెండరు జారీచేయలేదని కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. 400 పడకల ఆస్పత్రి (అదనంగా 50 పడకలు సూపర్‌ స్పెషాలిటీ వింగ్‌) బాధ్యతను సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీపీడబ్ల్యూడీ)కి అప్పగించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

ఎన్‌ఆర్‌డీఎంఎస్‌లో ఏపీ లేదు
న్యాచురల్‌ రీసోర్స్‌ డాటా మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎన్‌ఆర్‌డీఎంఎస్‌)లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లను చేర్చలేదని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞానశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌.. వైఎస్సార్‌సీపీ ఎంపీ పరిమల్‌ నత్వానీ ప్రశ్నకు జవాబుగా తెలిపారు.

ఆదర్శ సంపర్క్‌లో మౌలిక వసతులు
ఆదర్శ సంపర్క్‌ పథకంలో భాగంగా లేపాక్షి వీరభద్ర ఆలయం, శ్రీకాకుళంలోని శాలిహుండం బౌద్ధ ఆనవాళ్లు, నాగార్జున కొండల్లో పర్యాటకులకు మౌలికవసతులు కల్పిస్తున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

చేనేతకు ప్రోత్సాహమిచ్చే చర్యలు తీసుకోండి
తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చేనేత పరిశ్రమను రక్షించేలా కేంద్రం వారికి ప్రోత్సాహమిచ్చే చర్యలు తక్షణమే చేపట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కోరారు. ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు వారి జనాభా నిష్పత్తి ఆధారంగా బడ్జెట్‌ కేటాయించాలని, నూలు కొనుగోళ్లపై నేత కార్మికులకు సబ్సిడీని అందించే పథకాన్ని సవరించి అమలు చేయాలని కోరారు. దీన దయాళ్‌ హెల్త్‌ కార్గ్‌ ప్రోత్సాహ యోజనను పునరుద్ధరించడంతోపాటు రూ.30 లక్షల కన్నా తక్కువ టర్నోవర్‌ ఉన్న సొసైటీలే ఈ పథకానికి అర్హులన్న నిబంధనలను తొలగించాలని సూచించారు. నూలు వస్త్రంపై విధించిన 5 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దుచేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు