జేఎన్‌టీయూ ముంగిలి..ఆనంద లోగిలి

15 May, 2022 15:54 IST|Sakshi

అంబరమంటిన వర్సిటీ స్నాతకోత్సవ సంబరం

చాన్సలర్‌ హోదాలో హాజరైన  గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

విశిష్ట అతిథిగా ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌

డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీష్‌ రెడ్డికి గౌరవ డాక్టరేట్‌

ఆవిష్కరణలతో దేశాభివృద్ధికి బాటలు వేయాలని అతిథుల పిలుపు

అనంతపురం విద్య: రాయలసీమకే తలమానికంగా మారి, వజ్రోత్సవాల కీర్తి సొంతం చేసుకుని, ఇంజినీరింగ్‌ నిపుణుల ఖిల్లాగా పేరొందిన జేఎన్‌టీయూ అనంతపురం శనివారం ఆనంద లోగిలైంది. దేశం గర్వించదగ్గ ఎందరో శాస్త్రవేత్తలను అందించిన విద్యాలయంలో 12వ స్నాతకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆద్యంతం అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమానికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చాన్సలర్‌ హోదాలో హాజరుకావడం కొత్తకళను తెచ్చిపెట్టింది.

గవర్నర్‌ హాజరైనప్పటి నుంచి ముగిసేవరకు విద్యార్థులు, అధికారులు క్రమశిక్షణతో మెలిగారు. గవర్నర్‌ ప్రసంగానికి యువత ముగ్దులయ్యారు. ముఖ్య అతిథిగా ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌. సోమనాథ్‌ హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశేష విజయ ప్రస్థానం కలిగిన భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కి చైర్మన్, వర్సిటీ పూర్వ విద్యార్థి డాక్టర్‌ జి. సతీష్‌ రెడ్డికి గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడంతో వర్సిటీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కీలకోపన్యాసం చేస్తూ.. నూతన ఆవిష్కరణలతో సమాజ ప్రగతికి పాటుపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు.  

ఏడాదికి 10 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం  
భారత రక్షణ రంగంలో ఏడాదికి 10 వేల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తున్నట్లు డీఆర్‌డీఓ చైర్మన్‌ డాక్టర్‌ జి. సతీష్‌ రెడ్డి అన్నారు. గౌరవ డాక్టరేట్‌ అందుకున్న అనంతరం ఆయన  మాట్లాడారు. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు డీఆర్‌డీఓలో అవకాశం కల్పిస్తామన్నారు. ఎంటెక్‌ కోర్సుల్లో డిఫెన్స్‌ టెక్నాలజీ బ్రాంచ్‌లు ప్రవేశపెడతామన్నారు. జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థిగా గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు.  

ఆవిష్కర్తలకు ప్రోత్సాహం 
నూతన ఆవిష్కరణలు చేసే విద్యార్థులను ఇస్రో తరఫున ప్రోత్సహిస్తామని సంస్థ చైర్మన్‌ సోమనాథ్‌ అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోందని, మరణాన్ని జయించడం, జీవిత కాలాన్ని పెంపొందించడంపై ఇప్పటికే ప్రయోగాలు సాగుతున్నా యన్నారు. సైన్స్‌ మద్దతుతో ఆకలి, వ్యాధులను జయించేందుకు చేసిన కృషి సత్ఫలితాలనిచ్చిందన్నారు. ‘రాకెట్‌ను ఒక శిశువుగా పరిగణిస్తా, రూప కల్పన నుంచి ప్రయోగం వరకూ అనేక జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి విఫలమవుతుంటాం. జీవితంలో కూడా అనుభవం నుంచే పాఠాలు నేర్చుకోవాలి’ అని వివరించారు. అత్యుత్తమ సాంకేతికత గతల దేశాలే అభివృద్ధి చెందుతున్నాయని, ఈ విషయాన్ని విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అంతరిక్షంలోకి రోబోలను పంపి సమాచార సేక రణపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.   

ఐదేళ్లలో వర్సిటీకి రూ.1,296 కోట్లు 
జేఎన్‌టీయూ (ఏ)కు మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ (మెరూ) గుర్తింపు దక్కిందని వీసీ ప్రొఫెసర్‌ జింకా రంగజనార్దన అన్నారు. వర్సిటీ ప్రగతి నివేదికను ఆయన వివరించారు. మెరూతో వచ్చే ఐదేళ్లలో రూ.1,296 కోట్ల నిధులు రానున్నాయన్నారు. వర్సిటీలో రూ.98 కోట్లతో పాలనా భవనం, ఫార్మసీ బ్లాక్, జిమ్‌ హాల్, యోగా, మెడిటేషన్‌ భవనాల నిర్మాణం జరుగుతోందని, మరో రూ.23 కోట్లతో ధ్యాన్‌చంద్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మించనున్నట్లు తెలిపారు. పులివెందుల కళాశాలకు చెందిన ఎం. హర్షిత అమెజాన్‌ కంపెనీలో ఏడాదికి రూ.44 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం దక్కించుకుందన్నారు. 2020–21 విద్యా సంవత్సరంలో వర్సిటీ కాలేజీల్లో 565 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించగా, అనుబంధ కళాశాలల్లో 5,904 మందికి ఉద్యోగాలు దక్కాయన్నారు. జయంత్‌కుమార్‌ రెడ్డి, గీతాచరణ్‌ గేట్‌– 2022లో టాప్‌–10 ర్యాంకులు సాధించారన్నారు.

హాజరైన ప్రముఖులు  
స్నాతకోత్సవానికి పలువురు ప్రముఖులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా, యూపీఎస్సీ మాజీ సభ్యుడు ప్రొఫెసర్‌ వై. వెంక ట్రామిరెడ్డి, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సీఈఓ ఆలూరి సాంబశివారెడ్డి, ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్‌ రామకృష్ణా రెడ్డి, రెక్టార్‌ మల్లికార్జున రెడ్డి, రాయలసీమ వర్సిటీ వీసీ ఆనందరావు, ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన్, జేసీ కేతన్‌గార్గ్, జేఎన్‌టీయూ రెక్టార్‌ విజయకుమార్, రిజిస్ట్రార్‌ శశిధర్, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ కేశవ రెడ్డి, తదితరులున్నారు. 

‘బంగారు’ కొండలు
జేఎన్‌టీయూ (ఏ) స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 22 మంది విద్యార్థులకు 35 బంగారు పతకాలను ప్రకటించారు. వీరిలో 19 మంది స్నాతకోత్సవ వేదికపై పతకాలు అందుకోగా..వివిధ కారణాలతో ముగ్గురు గైర్హాజరయ్యారు. మొత్తం పతకాలలో డి.సుప్రజ (జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ, అనంతపురం) ఏకంగా ఆరు బంగారు పతకాలు అందుకోగా.. ఎం.సతీష్‌కుమార్‌ రెడ్డి (అనంతపురం),  కె.మైథిలి (అనంతపురం) మూడేసి చొప్పున,  టి.అనూష (అనంతపురం),  బి.సరయూ (అనంతపురం), బి.వీరవంశీ కుమార్‌ (అనంతపురం), సి.భావన రెడ్డి ( జేఎన్‌టీయూ కాలేజీ, పులివెందుల) రెండేసి బంగారు పతకాలు, వి.మౌనిక (అనంతపురం), జి.శ్రేయారెడ్డి (అనంతపురం), ఏ.సుధీర్‌ (పులివెందుల), కె.దేవహర్ష (పులివెందుల), బి.షేక్‌ షబీహా (పులివెందుల),  కే. గురుతేజస్విని (పులివెందుల), యు.విష్ణువర్ధన్‌ రెడ్డి (అనంతపురం) ఒక్కొక్క బంగారు పతకం అందుకున్నారు.

అలాగే వర్సిటీ అనుబంధ ప్రైవేటు కాలేజీల విభాగంలో ఎ.కిశోర్‌ ( విశ్వోదయ ఇంజినీరింగ్‌ కాలేజీ, కావలి), కె.సుప్రియ (ఎస్వీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఉమెన్, తిరుపతి), టి.శ్రీకాంత్‌ ( శ్రీవెంకటేశ పెరుమాళ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, పుత్తూరు), ఆర్‌.విష్ణుశ్రీ (శ్రీవెంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, కొడవలూరు, నెల్లూరు జిల్లా), టి.హరిత (పీబీఆర్‌ విశ్వోదయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కావలి), నాగరోహిణి (నారాయణ ఇంజినీరింగ్‌ కాలేజీ, నెల్లూరు), కె.మనోజ (ఎస్వీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్, తిరుపతి), బి.పెంచల కుమారి (అన్నమాచార్య కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, రాజంపేట) ఒక్కొక్క పతకం కైవసం చేసుకున్నారు. 

తండ్రి మరణించినా.. : నెల్లూరుకు చెందిన డి.సుప్రజ (జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ, అనంతపురం) ఏకంగా ఆరు బంగారు పతకాలు కైవసం చేసుకుని సత్తా చాటారు. ఎలక్ట్రికల్‌ విభాగంలో విశేష ప్రతిభ చూపి ‘బంగారు కొండ’గా నిలిచారు. సుప్రజ తల్లిదండ్రులు శివప్రసాద్, సరోజ. రెండేళ్ల క్రితం శివప్రసాద్‌ గుండెపోటుతో మరణించారు. తల్లి సరోజ ప్రోత్సాహంతో బీటెక్‌ను విజయవంతగా పూర్తి చేశారు. కళాశాల టాపర్‌గా నిలవడంతో పాటు బెస్ట్‌ అకడమిక్‌ ఫెర్ఫార్మర్‌ అమాంగ్‌ గర్ల్స్, చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్‌ గోల్డ్‌మెడల్, టీఎస్‌ రాఘవన్‌ ఎండోమెంట్‌ గోల్డ్‌మెడల్, చందుపల్లె వెంకట్రాయులు, సరోజమ్మ ఎండోమెంట్‌ గోల్డ్‌మెడల్‌ను సుప్రజ సొంతం చేసుకున్నారు. ఎలక్ట్రికల్‌కు సంబంధించిన పబ్లిక్‌ రంగ కంపెనీలో ఉద్యోగం సాధిస్తానని, నూతన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా సుప్రజ చెప్పారు. 

మరిన్ని వార్తలు