జేఎన్‌టీయూ అనంతపురం స్నాతకోత్సవం.. బంగారు కొండలు వీరే...

13 May, 2022 19:28 IST|Sakshi

ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను సమాజానికి అందించిన వర్సిటీ

డీఆర్‌డీఓ చైర్మన్‌ జి.సతీష్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్‌

హాజరు కానున్న చాన్సలర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ 

ఎంతో మంది జీవితాలకు మంచి పునాది వేసింది జేఎన్‌టీయూ... సమాజానికి శాస్త్రవేత్తలు, ఇంజినీరింగ్‌ నిపుణులను అందించింది నాణ్యమైన పరిశోధనలకూ కేరాఫ్‌గా మారింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల్లో అనంత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది జేఎన్‌టీయూ అనంతపురం. శనివారం 12వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.  

అనంతపురం విద్య: జేఎన్‌టీయూ అనంతపురం 1946లో ఒక కళాశాలగా ఏర్పడింది. విశ్వవిద్యాలయంగా ఏర్పడిన ఆనతి కాలంలోనే అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకుంది. పరిశోధనల్లో నాణ్యతా ప్రమాణాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. బీటెక్, బీఫార్మసీ, ఫార్మాడీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు అందిస్తోంది. విదేశీ వర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నూతన ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తెచ్చింది.

వర్సిటీ పరిధిలో అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఉన్న అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏటా 1.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జేఎన్‌టీయూ అనంతపురం క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, కలికిరి ఇంజినీరింగ్‌, పులివెందుల ఇంజినీరింగ్‌ కళాశాలలు స్వతంత్య్ర ప్రతిపత్తి సాధించాయి. ప్రైవేట్‌ కళాశాలల్లోనూ పరిశోధన చేయడానికి వీలుగా 16 రీసెర్చ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. జాతీయ సేవా పథకాన్ని సమర్థవంతంగా చేస్తున్నందుకు ఇందిరాగాంధీ జాతీయ సేవా పథకం అవార్డు జేఎన్‌టీయూ, అనంతపురం సొంతం చేసుకుంది.  

పూర్వ విద్యార్థుల చేయూత
క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఇటీవలే వజ్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో అధిరోహించిన పూర్వ విద్యార్థులు చేయూతనందించారు. రూ.8 కోట్లు వెచ్చించి 100 గదులతో విద్యార్థుల హాస్టల్‌ నిర్మాణానికి చేయూతనిచ్చారు. పూర్వ విద్యార్థులు ఇచ్చిన సహకారంతో ప్రత్యేకంగా హాస్టల్‌ నిర్మిస్తుండడం విశేషం. రూ.50 లక్షలు విలువైన ల్యాబ్‌ సదుపాయాన్ని కూడా పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేశారు.  

సతీష్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్‌ 
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ–డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌రెడ్డికి జేఎన్‌టీయూ అనంతపురం గౌరవ డాక్టరేట్‌ను అందజేస్తోంది. గతేడాది ఎస్కేయూ కూడా ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సతీష్‌రెడ్డి జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ విభాగంలో 1984లో బీటెక్‌ పూర్తి చేశారు. ఎంటెక్, పీహెచ్‌డీని జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో పూర్తిచేసిన తర్వాత డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబోరేటరీలో శాస్త్రవేత్తగా చేరారు. వివిధ హోదాల్లో పనిచేసి కీలకమైన డీఆర్‌డీఓ చైర్మన్‌ హోదాలో పనిచేస్తున్నారు.  

35,177 మందికి డిగ్రీలు.. 81 మందికి పీహెచ్‌డీలు 
జేఎన్‌టీయూ అనంతపురం 12వ స్నాతకోత్సవానికి అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులతో పాటు విద్యార్థులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. స్నాతకోత్సవానికి చాన్సలర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మొత్తం 35,177 మంది విద్యార్థులకు డిగ్రీలు, 81 మందికి పీహెచ్‌డీలు ప్రదానం చేయనున్నారు. 

బంగారు కొండలు వీరే... 
జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో కే. మైథిలి, ఈఈఈలో డి. సుప్రజ, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఎం. సతీష్‌కుమార్‌రెడ్డి, ఈసీఈలో టి. అనూష, సీఎస్‌ఈలో బి. సరయూ, కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బి. వీరవంశీకుమార్‌ బంగారు పతకాలను సాధించారు. 


సువర్ణ విజేత.. సుప్రజ 

జేఎన్‌టీయూ అనంతపురం ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌ పూర్తిచేసిన సుప్రజ ఆరు బంగారు పతకాలు దక్కించుకున్నారు. 9.14 జీజీపీఏ సాధించి బ్రాంచ్‌ టాపర్‌గా నిలిచారు. అలాగే ప్రొఫెసర్‌ తిరువెంగళం గోల్డ్‌మెడల్, చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్‌ గోల్డ్‌మెడల్, ప్రొఫెసర్‌ టీఎస్‌ రాఘవన్‌ గోల్డ్‌మెడల్, చండుపల్లి వెంకటరాయుడు– సరోజమ్మ గోల్డ్‌మెడల్, కళాశాల టాపర్‌ మహిళా విభాగం కోటాలోనూ గోల్డ్‌మెడల్‌ దక్కించుకున్నారు. ఎలక్ట్రికల్‌ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తానని సుప్రజ పేర్కొన్నారు.   


చదువుల తల్లి .. మైథిలి
 
జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్‌ కళాశాలలోని సివిల్‌ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన మైథిలి మూడు బంగారు పతకాలు దక్కించుకున్నారు. సివిల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ టాపర్‌గా నిలవడంతో పాటు చల్లా సుబ్బరాయుడు ఎండోమెంట్‌ గోల్డ్‌మెడల్, కే.వెంకటేశ్వరరావు గోల్డ్‌మెడల్‌కు ఎంపికయ్యారు. సివిల్‌ ఇంజినీరింగ్‌లో చదవాలనే ఆకాంక్షతోనే కష్టపడి చదివానని, బ్రాంచ్‌ టాపర్‌ రావడం ఆనందంగా ఉందని మైథిలీ పేర్కొన్నారు.  


మెకానికల్‌ టాపర్‌ .. సతీష్‌ 

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఎం.సతీష్‌రెడ్డి మూడు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. మెకానికల్‌ బ్రాంచ్‌ టాపర్‌తో పాటు కళాశాల టాపర్, టీవీ లక్ష్మణరావు గోల్డ్‌మెడల్‌ దక్కింది. నానోటెక్నాలజీ రంగంపై దృష్టి సారించినట్లు సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. మెకానికల్‌ రంగంలోని అధునాతన పరిశోధనలే తన లక్ష్యమన్నారు.  

అగ్రగామిగా తీర్చిదిద్దుతాం 
జేఎన్‌టీయూ అనంతపురాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. నాణ్యమైన పరిశోధనలతో పాటు అత్యుత్తమ బోధన ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను అందించే దిశగా విద్యా ప్రణాళికను సమూలంగా మార్పు చేశాం. కోర్సు పూర్తియ్యేలోపు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. విద్యార్థుల సర్టిఫికెట్ల భద్రతకు డీజీ లాకర్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఎన్‌బీఏ గుర్తింపు దక్కేలా కృషి చేశాం. 
– జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్‌టీయూ అనంతపురం

మరిన్ని వార్తలు