విద్యార్థి ఆత్యహత్య కేసు: చనిపోవడానికి ముందు వేరే గదికి!

7 Jan, 2023 12:32 IST|Sakshi

సాక్షి, అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: రెండు రోజుల క్రితం అనంతపురం జేఎన్‌టీయూలో కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య కేసు దర్యాప్తును వన్‌టౌన్‌ పోలీసులు ముమ్మరం చేశారు. జేఎన్‌టీయూ (ఏ)లో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన రమణారెడ్డి, విజయ దంపతుల కుమారుడు చాణిక్య నందరెడ్డి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

దీనిపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్‌ పోలీసులు వర్సిటీలోని ఎల్లోరా హాస్టల్‌లో చాణిక్య ఉంటున్న నంబర్‌ 131 గదిలోని నలుగురు విద్యార్థులతో పాటు చాణిక్య ఆత్మహత్య చేసుకునే ముందు నిద్రించిన గదిలోని అత్యంత సన్నిహితున్ని శుక్రవారం విచారణకు పిలిచారు. ఎవరితో పెద్దగా విభేదాలు లేవని, ప్రేమ వ్యవహారాలు కూడా నడవలేదని, ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకున్నాడన్న దానిపై తమకూ స్పష్టత లేదని వారు చెప్పినట్లు సమాచారం. అయితే, డిసెంబరు 31 రాత్రి నుంచి చాణిక్య మూడీగా ఉన్నట్లు వెల్లడించినట్లు తెలిసింది.   

ఆత్మహత్యకు ముందు 134 గదిలోకి..
చాణిక్య తను ఉండాల్సిన 131 నంబరు గదిలో కాకుండా 134లోకి రావడానికి కారణాన్ని కూడా పోలీసులు తెలుసుకున్నారు. తనతో పాటు ఇంటర్‌ నుంచి కలసి చదువుతున్న విద్యార్థి నరేంద్ర సీఈసీ తీసుకున్నాడు. తను 134 గదిలో ఉంటున్నాడు. దీంతో ఎక్కువగా చాణిక్య కూడా అతనితో గడిపేవాడు. చనిపోయే ముందు కొన్ని గంటల ముందు కూడా చాణిక్య అక్కడే పడుకున్నాడు.

కాగా తను ఎప్పుడు నిద్ర లేచి వెళ్లాడో తెలియదని నరేంద్ర అంటున్నాడు. తను చనిపోయిన విషయం హాస్టల్‌లో విద్యార్థులకు కూడా ఆరు గంటల దాకా తెలియదంటున్నారు. ఇదిలా ఉండగా హాస్టల్‌ టెర్రస్‌ పైభాగాన చాణిక్య చెప్పులు వదిలేసి ఉండటం పోలీసులకు   అనుమానాన్ని పెంచుతోంది.  

సెల్‌ఫోన్‌లోనూ నో క్లూ.. 
చాణిక్యనందరెడ్డి సెల్‌ఫోన్‌ను తనిఖీ చేసిన పోలీసులకు అందులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రేమ వ్యవహారాలుంటే అందులో ఏదో ఒక చోట సంభాషణ, లేదా    పంపిన సందేశాలుండేవి. అయితే,      అలాంటివి లేవంటున్నారు. గతంలో జేఎన్‌టీయూలో జరిగిన ర్యాగింగ్‌ బ్యాచ్‌ల్లో చాణిక్య ఉన్నాడా? అని కూడా ఆరా తీయగా, వాటితో ఎలాంటి సంబంధం లేదని విచారణలో తెలిసినట్లు సమాచారం. ఆర్థిక సమస్యలుండవచ్చనే కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవముండవచ్చని కూడా పోలీసులు అనుమానించారు.

కుటుంబం ఆర్థిక సమస్యల్లో ఉందేమోగాని.. చాణిక్య వరకు అలాంటి ఇబ్బంది లేదు. కారణం తను దుబారా ఖర్చులు చేసేవాడు కాదట. చదువు మినహా మరో వ్యాపకం కూడా లేదని  అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా తనకు వచ్చిన రూ. 60 వేల స్కాలర్‌ షిప్‌ కూడా తండ్రి ఖాతాలోకి మళ్లించాడు. లోన్‌యాప్స్, క్రెడిట్‌కార్డులు లాంటి అవకాశం కూడా లేదని పోలీసులు చెబుతున్నారు. సెల్‌ఫోన్‌లో ఎక్కడా ఆ జాడలు లేవు. కాని చాణిక్య తను చనిపోయే ముందు సెల్‌ఫోన్‌లో టైప్‌ చేసి ఉంచిన  మైఫైల్స్‌ సందేశంలో మాత్రం.. వ్యక్తిగత సమస్యలతోనే చనిపోతున్నట్లు ఉంది. తన సోదరి గీతారెడ్డికి పంపిన సందేశంలోని సారాంశాన్ని పరిశీలించిన పోలీసులు కుటుంబ ఆర్థిక పరిస్థితితోనే చాణిక్య ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు. 

(చదవండి: మేనమామతో పెళ్లి.. భర్త తీరు బాగోలేదంటూ వివాహిత షాకింగ్‌ ట్విస్ట్‌)

మరిన్ని వార్తలు