JNTU Vizianagaram: చదువు+ ఉద్యోగం= జేఎన్‌టీయూ

7 Sep, 2022 18:42 IST|Sakshi
జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం యూనివర్సిటీ ప్రాంగణం

విద్యార్థులకు ఉద్యోగమార్గం చూపుతున్న వర్సిటీ చదువులు

కొలువులు సాధించేలా ఇంజినీరింగ్‌ విద్యాబోధన

ఆరేళ్లలో 1,075 మందికి ప్లేస్‌మెంట్‌

గత ఏడాది నుంచి ‘జాతీయ నూతన విద్యావిధానం’ అమలు

ఇంజినీరింగ్‌ ఆనర్స్‌ డిగ్రీ 26 కంపెనీలతో ఎంఓయూ 

జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం యూనివర్సిటీ... చక్కని చదువుల నిలయం. ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న వర్సిటీ.. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్‌ విద్యను బోధిస్తోంది. నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తోంది. ఉద్యోగ సాధనకు తోడ్పడుతోంది. పారిశ్రామిక వేత్తలుగా మలుస్తోంది. వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతోంది. వర్సిటీలో అమలుచేస్తున్న నూతన విద్యావిధానం, నిర్వహిస్తున్న కోర్సులు, ఉపాధికల్పనకు ‘సాక్షి’ అక్షరరూపం.  


విజయనగరం అర్బన్‌:
 విజయనగరం పట్టణానికి సమీపంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో 2007వ సంవత్సరంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పడింది. ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషితో కళాశాల కాస్త వర్సిటీగా రూపాంతరం చెందింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వర్సిటీ ఇంజినీరింగ్‌ చదువులకు నిలయంగా మారింది.

విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించేలా.. వారిలో నైపుణ్యాలను పెంపొందించేలా ఈ ఏడాది మొదటి సంవత్సరం ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ఆనర్స్, మైనర్‌ పేరుతో విస్తరణ డిగ్రీలను ప్రవేశపెట్టింది. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపొందించిన నూతన సిలబస్, బోధనా విధానాన్ని అమలు లోకి తెచ్చింది. మొత్తం 8 సెమిస్టర్స్‌లో తొలి మూడు మినహా మిగిలిన ఐదు సెమిస్టర్స్‌తోపాటు 10 నెలల ఇంటెర్న్‌షిప్‌ చేయిస్తారు. ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్‌ఈ, ఐటీ, మెకానికల్‌ డిగ్రీలలో 66 సీట్ల చొప్పున, సివిల్, మెటలడ్జికల్‌ సబ్జెక్టు బీటెక్‌ డిగ్రీలలో 33 సీట్ల చొప్పున వర్సిటీలో బోధన సాగుతోంది.  
  

ఇంజినీరింగ్‌ ఆనర్స్‌ డిగ్రీ
             
విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ డిగ్రీని మూడు విధాలుగా విభజించారు. ఎప్పటి మాదిరిగా ఇచ్చిన కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు యథావిధిగా సాధారణ బీటెక్‌ డిగ్రీ వస్తుంది. డిగ్రీ సిలబస్‌తోపాటు ఇతర (డిగ్రీ సబ్జెక్టులకు సంబంధం లేని) అదనపు ప్రతిభాంశాలను ఉన్నట్లు నిర్ధారించుకున్న వారికి ఆనర్‌ డిగ్రీ ఇస్తారు. దీనికోసం మొత్తం ఎనిమిది సెమిస్టర్స్‌లోనూ 80 శాతం ఉత్తీర్ణతను చూపాల్సి ఉంటుంది. తొలుత రెండో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ ఫలితాలలో అప్పటికి పూర్తయిన మూడు సెమిస్ట్‌లో 80 శాతంతో చూపిన ఫలితాల (ఒకే సారి ఉత్తీర్ణత పొందాలి) ఆధారంగా రిజస్టర్‌ అయిన విద్యార్థిని ఆనర్‌ డిగ్రీ విభాగంలోకి తీసుకుంటారు. అప్పటి నుంచి చివరి సెమిస్టర్‌ వరకు కనీసం 160 క్రెడిట్‌ పాయింట్లతో పాటు అదనపు నైపుణ్యాలపై మరో 20 క్రెడిట్‌ పాయింట్లు తెచ్చుకోవాలి. 


1,075 మందికి ప్లేస్‌మెంట్‌

కళాశాలలో ఏడు కోర్సులలో బీటెక్‌ డిగ్రీని విద్యార్థులకు అందిస్తోంది. ఇప్పటివరకు 1,079 మంది విద్యార్థులు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు. 11.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరికొందరు పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న విద్యాసంవత్సరం నాలుగో సంవత్సర విద్యార్థులు ఇప్పటివరకు 75 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. రానున్న రెండు నెలల్లో మరో 10 కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి. 26 కంపెనీలతో వర్సిటీ ఎంఓయూ చేసుకున్నట్టు వెల్లడించాయి.  

ఇంజినీరింగ్‌ మైనర్‌ డిగ్రీ 
బీటెక్‌ కోర్సులో చేరే విద్యార్థులు ప్రధాన సబ్జెక్టుతోపాటు ఇతర ఇంజినీరింగ్‌ కోర్సుల్లో మరో సబ్జెక్టులో కూడా ప్రతిభ చూపాలనుకునే వారికి ఈ డిగ్రీ రూపంలో అవకాశాన్నిచ్చారు. మొదటి మూడు సెమిస్టర్‌ ఫలితాలలో 80 శాతం పాయింట్లను  తెచ్చుకున్న వారికి మైనర్‌ డిగ్రీ కోర్సులకు రిజిస్టర్‌ చేయిస్తారు.  


నైపుణ్యం సాధించేలా బోధన
 
అమెజాన్‌ సుపోర్టు ఇంజినీరింగ్‌ సంస్థలో ఉద్యోగం వచ్చింది. వార్షిక వేతనం రూ.11 లక్షలుగా నిర్ణయించారు. చాలా ఆనందంగా ఉంది. కళాశాలలో నైపుణ్యాభివృద్ధికి అనుగుణంగా అందించే బోధనలు వల్లే ఉద్యోగం సాధించగలిగాను. ఇంజినీరింగ్‌ సబ్జెక్టులతోపాటు ఉద్యోగావకాశాల అదనపు అంశాల్లో అందించిన గైడెన్స్‌ బాగుంది.  
– పి.సాహితి జ్యోత్స్న, సీఎస్‌ఈ విద్యార్థిని, జేఎన్‌టీయూ విజయనగరం  


ఉద్యోగ కల్పనే లక్ష్యంగా...  

ఉద్యోగ కల్పనే లక్ష్యంగా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరిచే ప్రణాళికలను రూపొందించాం. దేశ, అంతర్జాతీయ స్థాయిలోని 26 ప్రతిష్టాత్మకంగా కంపెనీలతో ఉద్యోగ నియామక ఒప్పందాలు పెట్టుకున్నాం. ఇంజినీరింగ్‌ కోర్సులపై అత్యాధునిక బోధనా విధానాన్ని అనుసరించడంతో పాటు విద్యార్థుల్లో ఉన్న అభిరుచికి అనుగుణంగా వారిలోని నైపుణ్యాలను వెలికితీస్తాం. దీనికోసం జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. గత ఏడాది మొదటి సంవత్సరం నుంచి నూతన విద్యావిధానాన్ని అమలుచేస్తున్నాం.  
– ప్రొఫెసర్‌ శ్రీకుమార్, ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల, విజయనగరం
 

చక్కని శిక్షణ  

టీసీఎప్‌ డిజిటల్‌ సంస్థలో 7.5 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించాను. ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూలో ఇంజినీరింగ్‌ సబ్జెక్టు అంశాలతో పాటు ఆ సంస్థకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాలను పరీక్షించారు. కళాశాలలో ప్రత్యేకించి ఉన్న ప్లేస్‌మెంట్‌ విభాగం ఆ దిశగా అందించిన శిక్షణ వల్ల ఉద్యోగం సాధించగలిగాను.                
– ఎం.జాహ్నవి, సీఎస్‌ఈ, జేఎన్‌టీయూ, విజయనగరం

మరిన్ని వార్తలు