వివక్షతను తిరస్కరించిన అమెరికన్స్

8 Nov, 2020 15:19 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ‘ కొందరి వాడుగా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికన్ ప్రజలు తిరస్కరించి అందరివాడైన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను అమెరికా అధ్యక్షునిగా ఎన్నుకోవడం హర్షణీయం.జో బైడెన్ రాకతో హెచ్-1 బీ  వీసాలపై ఆంక్షలు రద్దు అవుతాయి. ఒక కోటి 10 లక్షల మంది వలస వేతన జీవులకు అమెరికా పౌరసత్వం లభించే ఆస్కారం కలుగుతుంది. భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కావడం, తొలిసారిగా మహిళ ఉపాధ్యక్ష పదవి చేపట్టడం హర్షణీయం. ట్రంప్ అమెరికా సమాజాన్ని విడదీయగా జో బైడెన్ అందరినీ కలుపుకుని ఐక్యతా రాగాన్ని వినిపిస్తారు’ అని జన చైతన్య వేదిక చైర్మన్‌, మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు.

‘ట్రంప్‌ను ఓడించాలనే బలమైన కోర్కెతో అత్యధిక శాతం ఓటింగ్ జరిగింది. నల్ల జాతీయులు, మైనార్టీలు, ఆఫ్రికన్స్ ...ట్రంప్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. అందరి అధ్యక్షునిగా జో బైడెన్ వివక్షతకు స్వస్తి పలుకుతారు. భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం అవుతాయి. ప్రపంచ దేశాలందరికీ ఆవాసం కల్పిస్తున్న అమెరికా ఆ చారిత్రక వారసత్వాన్ని కొనసాగిస్తుంది. అమెరికన్ ప్రజలను విభజించడం, వివక్షత చూపించడం, చిలిపి చేష్టలు, కరోనాను ఎదుర్కొన లేకపోవడం తదితర కారణాలతో ట్రంప్ ఓటమి చవి చూశారు.  బైడెన్ నేతృత్వంలో అమెరికాలో వివక్షత తొలగిపోతుందని, భారత్‌తో సత్ సంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నాను.’ అని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు