ఎన్టీఆర్‌పై నిజంగా ప్రేమే ఉంటే.. భారతరత్న కోసం బాబు ఏం చేశారు?: జోగి రమేష్‌

21 Sep, 2022 10:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నేతలు ప్రతిరోజూ సభలో గొడవపెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ప్రతిపక్షం పనికిరాని పక్షంగా మారిపోయింది. ప్రజలకు టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌ గుర్తుకురారు. పదవిలో లేనప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఎన్టీఆర్‌ గుర్తుకు వస్తారు. వివాదం చేయడానికి టీడీపీ నేతలు రోజుకో అంశాన్ని ఎంచుకుంటున్నారు. ఎన్టీఆర్‌పై నిజంగా ప్రేమ ఉంటే చెప్పులు, రాళ్లతో ఎందుకు కొట్టారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఎన్టీఆర్‌పై నిజమైన ప్రేమ ఉంది. జిల్లాకు ఎన్టీఆర్‌ పెడతానన్న హామీని నిలబెట్టుకున్నారు. 

ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం చంద్రబాబు ఏం చేశారు?. ఎన్డీఏతో అధికారం పంచుకున్నప్పుడు భారతరత్న ఎందుకు ఇవ్వలేదు. లోకేష్‌ పాదయాత్రే కాదు పొర్లు దండాలు పెట్టినా ప్రయోజనం లేదు.  ఎన్టీఆర్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా జిల్లా పేరు పెట్టాం. ఎన్టీఆర్‌ను గౌరవించిన పార్టీ వైఎస్సార్‌సీపీ. వైద్య రంగంలో వైఎస్సార్‌ గొప్ప సంస్కరణలు తెచ్చారు. ఆరోగ్యశ్రీతో పేదలకు ఆరోగ్య భరోసా లభించింది. పేదల ఆరోగ్యం కోసం ఆలోచించిన వ్యక్తి వైఎస్సార్‌. వేలమంది ప్రాణాలను 108 సర్వీస్‌ కాపాడింది. హెల్త్ యూనివర్శిటీపై చర్చ కొనసాగితే తప్పేముంది. పేదలకు సేవ చేశాడు కాబట్టే హెల్త్ యూనివర్శిటీకి  వైఎస్సార్‌ పేరు పెట్టాలని బిల్లు తీసుకొస్తున్నాం’ అని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు