కులాల మధ్య చంద్రబాబు చిచ్చు

22 Aug, 2021 04:58 IST|Sakshi

నా మాటల్ని వక్రీకరించారు 

ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఆగ్రహం 

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ విరుచుకుపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేం ద్ర కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. టీడీపీ తెలుగు తాలిబన్‌ పార్టీగా మారిందని మండిపడ్డారు. ‘నేను అనుచిత వ్యాఖ్యలు చేశానని, నా మీద కేసు పెట్టాలని కోరిన చంద్రబాబుపై ముందుగా కేసు పెట్టాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నారు, నేను ఏమన్నానో పరిశీలిస్తే సరిపోతుంది’ అని పేర్కొన్నారు. ‘దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా. దళితవాడల్లో జీవించాలని ఎవరైనా కోరుకుంటారా’ అని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు మాట్లాడినందుకు ఆయనపై ఏ కేసు పెట్టాలి, ఏ శిక్ష వేయాలని ప్రశ్నించారు.

బీసీ వర్గాలకు చెందిన విశ్వ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామని, శ్రీకాకుళం జిల్లాలో అగ్నికుల క్షత్రియుల్ని తరిమి తరిమి కొడతామని చంద్రబాబు అన్నారు. అలాంటి మాటలు మాట్లాడినందుకు చంద్రబాబుకు ఏ వేయాలో చెప్పాలని నిలదీశారు. గతంలో ఎస్సీలు, బీసీలపై చంద్రబాబు చేసిన కామెంట్స్‌ను మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరల్‌ స్థానాల్లో కూడా జిల్లా పరిషత్, మేయర్లు, చైర్మన్‌ పదవుల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూర్చోబెడుతున్నారని తెలిపారు. నామినేటెడ్‌ పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. 56 కార్పొరేషన్లను బీసీ కులాలకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.  ఈ విషయాల్ని తాను చెబుతుంటే చంద్రబాబు, టీడీపీ నాయకులు చిలవలు, పలవలు చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏం మాట్లాడానని తన మీద నిందలు వేస్తూ డీజీపీకి ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు