తక్కువ ముళ్లు.. ఎక్కువ రుచి! అప్పలు చేప.. లాభాలు గొప్ప!

26 Feb, 2022 14:55 IST|Sakshi
జాన్‌ స్నాపర్‌ (అప్పలు చేపలు)

ప్రయోగాల దశలో జాన్స్‌ స్నాపర్‌ చేపలు(అప్పలు) 

నాలుగేళ్లుగా సీఎంఎఫ్‌ఆర్‌ఐ పరిశోధనలు 

చివరి దశకు చేరుకున్నాయంటున్న శాస్త్రవేత్తలు 

మార్కెట్‌లో కిలో రూ.400 నుంచి రూ.450 వరకూ ధర 

త్వరలోనే మత్స్యకారులకు పంపిణీకి సన్నాహాలు

కష్టాలకు ఎదురీదుతూ చేపలు పడుతూ..  కడుపు నింపుకొంటున్న గంగపుత్రులకు  సంద్రమంత లాభాలు తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రయత్నాలు  చేస్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త కొత్త  వంగడాలు సృష్టిస్తూ.. జలపుష్పాలు పెంచేందుకు నీలివిప్లవం సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నాయి.  ఆఫ్రికా, ఆస్ట్రేలియా తీరాల్లో లాభాల పంట పండిస్తున్న అప్పలు చేపను విశాఖ మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సముద్ర మత్స్య పరిశోధన కేంద్ర సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) చేస్తున్న ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. 

సాక్షి, విశాఖపట్నం : లుట్‌జానిడే కుటుంబానికి చెందిన జాన్‌ స్నాపర్‌ (అప్పలు చేపలు) ఇండో–వెస్ట్‌ పసిఫిక్‌లో తూర్పు ఆఫ్రికా నుంచి ఫిజీ వరకు, దక్షిణాన ఆస్ట్రేలియా వరకు విస్తరించిన సముద్ర జలాల్లో విరివిగా పెరుగుతుంటాయి. మన దేశంలోనూ ఈ చేపలు పశి్చమ, తూర్పు తీరాల్లోనూ అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ చేపలు ఎక్కువగా పగడపు దిబ్బలు, రాళ్లు, లోతైన సముద్రాల్లో పెరుగుతుంటాయి. వేగవంతమైన వృద్ధి, పరిస్థితులకు సులభంగా పెరిగే స్వభావం వీటి సొంతం. అందుకే విశాఖతో పాటు తమిళనాడు, కొచ్చి తీర ప్రాంతంలో ప్రజలకు పెంపకానికి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు సీఎంఎఫ్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు.  

నాలుగేళ్లుగా పరిశోధనలు..
విశాఖలోని సీఎంఎఫ్‌ఆర్‌ సంస్థ అప్పలు రకం చేపను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వేటకు వెళ్లే వారికి చాలా అరుదుగా దొరికే ఈ చేపల్లో తక్కువ ముళ్లు, ఎక్కువ రుచితో ఉండే ఆయా చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటోంది. కేజీ రూ.450 నుంచి రూ.500వరకు ధర పలుకుతోంది. ఈ కారణంగా వీటిని పెంచేందుకు మత్స్యకారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంగపుత్రులకు అప్పలు అందించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.

నాలుగేళ్ల క్రితం ఏడాది పాటు శ్రమించి 100కిపైగా ఆడ జాన్‌ స్నాపర్స్, మగ జాన్‌ స్నాపర్స్‌ని సముద్రం నుంచి సేకరించారు. ఇందులో 20 మేలుజాతి జతల ద్వారా పరిశోధనలు చేపట్టారు. సీఎంఎఫ్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు డాక్టర్‌ రితేశ్‌ రంజన్, డాక్టర్‌ శుభదీప్‌ ఘోష్, డాక్టర్‌ శేఖర్‌ బృందం కలిసి భారత బయో టెక్నాలజీ విభాగం నుంచి ఒక ప్రాజెక్టుకు అర్హత సాధించారు. సేకరించిన అప్పలు చేపలను కృత్రిమంగా పెంచే విధానంపై పరిశోధనలు ప్రారంభించారు. 

చివరి దశకు చేరుకున్న పరిశోధనలు 
ప్రయోగశాలలో ఉంచిన సముద్రపు నీటిలో అప్పలు చేపలు పెరుగుదల ఉండటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. పెరుగుదలతో పాటు ఉత్పత్తి కూడా అద్భుత ఫలితాల్ని ఇచ్చినట్లు గుర్తించారు. నాలుగేళ్ల కాలంలో అప్పలు చేపలకు వివిధ రకాల ఆహారాల్ని అందించి ఏ ఆహారం సులువుగా జీర్ణమవుతుందోనని పరీక్షలు నిర్వహించి అన్నివిధాలుగా సఫలీకృతులయ్యారు. ఇందుకోసం ఆడ,మగ చేపలు ఒకదానికొకటి ఆకర్షితులయ్యేలా ప్రత్యేక ఇంజక్షన్లు ఇచ్చి ఉత్పత్తిని పెంచేలా చేసిన పరిశోధనలు సత్ఫలితాలిచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

42 గంటల్లో ఆడమగ చేపలు ప్రేరిపితమై సంతానోత్పత్తికి సిద్ధమైనట్లు గుర్తించారు. గుడ్లు పెట్టేలా చేయడంలోనూ సీఎంఎఫ్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఈ గుడ్లను పిల్లలుగా మారేందుకు ప్రయోగశాలల్లో ప్రత్యేకంగా ఉన్న 2 టన్నుల సామర్థ్యం కలిగిన హేచరీల్లో అనుకూల వాతావరణాన్ని అభివృద్ధి చేశారు. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో 14 గంటల లార్వా నుంచి బయటికి వచ్చినట్లు వెల్లడించారు. తర్వాత  వేల సంఖ్యలో చేప పిల్లలు బతకడంతో పాటు పెద్దవిగా పెరిగాయి. 42 రోజుల పెంపకం తర్వాత 3.67% మనుగడ రేటు సాధించినట్లు గుర్తించారు.

సాధారణంగా ఏడాది వ్యవధిలో కిలోకి పైగా బరువు పెరగడాన్ని గమనించారు. ఒక్కోచేప మూడున్నర కేజీల వరకూ పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా 125 టన్నుల వరకూ చేపల్ని పెంచి పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధనలు చివరి దశకు వచ్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. త్వరలోనే మత్స్యకారులకు ఈ అప్పలు చేపలను పెంపకానికి అందిస్తామని వెల్లడించారు. తీరాలలో ఏర్పాటు చేసిన కేజ్‌ కల్చర్‌ విధానంలో వీటిని పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ చేపల పెంపకం విజయం సాధిస్తే.. మత్స్యకారులకు అప్పలు చేపలు లాభాల పంట పండించినట్లే.

మరిన్ని వార్తలు