వీడియో వైరల్‌.. ఆరుగురు వార్డు వలంటీర్ల తొలగింపు

14 Dec, 2020 08:56 IST|Sakshi
స్రవంతిని కలెక్టర్‌కు సరెండర్‌ చేస్తూ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులు

వేడుకలు చేసుకున్న రెవెన్యూ సెక్రటరీ కలెక్టర్‌కు సరెండర్‌ 

విచారణకు ఆదేశించిన జాయింట్‌ కలెక్టర్‌

సాక్షి, తెనాలి అర్బన్‌: వార్డు సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీ విధులు పక్కన పెట్టి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. జేసీ స్పందించి విచారణకు ఆదేశించారు. నిజమేనని తేలడంతో ఆరుగురు వార్డు వలంటీర్లను విధుల నుంచి తొలగించడంతో పాటు రెవెన్యూ సెక్రటరీని కలెక్టర్‌కు సరెండర్‌ చేస్తూ మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.జశ్వంతరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. స్థానిక ఐదో వార్డు సచివాలంలో పి.స్రవంతి రెవెన్యూ సెక్రటరీగా పని చేస్తున్నారు. గత నెల 19న ఆమె పుట్టిన రోజు వేడుకల్ని వార్డు వలంటీర్లు నిర్వహించారు. దాన్ని ఓ వలంటీర్‌ సెల్‌లో రికార్డు చేసి రెండు రోజుల కిందట సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. చదవండి: (ఏలూరు బాధితులకు అండగా ప్రభుత్వం)

ఇది వైరల్‌ కావడంతో జేసీ వెంటనే స్పందించి విచారణ జరపాలని తెనాలి మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.జశ్వంతరావును ఆదేశించారు. ఆయన శనివారం సంబంధిత వార్డు రెవెన్యూ సెక్రటరీ స్రవంతి, వలంటీర్లు తాడిబోయిన రత్నకుమారి, సోముపల్లి అలేఖ్య, ఎం.ప్రభుకుమార్, షేక్‌ రేహమున్నీసా, ఎం.లావణ్య, టి.లీలా హరీష్‌ను పిలిపించి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వారి నుంచి లిఖితపూర్వంగా వివరణ తీసుకున్నారు. విధులకు అటంకం కలిగిస్తూ వేడుకలు జరుపుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్‌ ఆరుగురు వార్డు వలంటీర్లను విధుల్ని నుంచి ఆదివారం తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవార్డు రెవెన్యూ సెక్రటరీని జిల్లా కలెక్టర్‌కు సరెండర్‌ చేశారు. చదవండి: (42,313 ఎకరాల్లో 5 పారిశ్రామిక పార్కులు)

మరిన్ని వార్తలు