జేపీ నడ్డా ఏపీ పర్యటన 

6 Jun, 2022 06:06 IST|Sakshi

నేడు, రేపు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటన 

విజయవాడ, రాజమహేంద్రవరాల్లో పలు కార్యక్రమాలకు హాజరు 

నేడు విజయవాడలో బీజేపీ శక్తికేంద్రాల ఇన్‌చార్జీలు, కోర్‌ కమిటీ నేతలతో భేటీలు 

రేపు సాయంత్రం రాజమండ్రిలో బహిరంగసభకు హాజరు 

సాక్షి, అమరావతి: ప్రధానిగా నరేంద్రమోదీ ఎనిమిదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలతోపాటు ఏపీలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో 40 వేలకుపైగా ఉన్న పోలింగ్‌ కేంద్రాలను బీజేపీ తొమ్మిదివేల శక్తికేంద్రాలుగా వర్గీకరించి వాటికి ఇన్‌చార్జీలను నియమించింది.

రాష్ట్రంలోని శక్తికేంద్రాల ఇన్‌చార్జీలతో సోమవారం ఉదయం విజయవాడలో నడ్డా భేటీ అవుతారు. ఉదయం 11 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చే ఆయన నేరుగా విజయవాడ సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ గ్రౌండ్‌లో శక్తికేంద్రాల ఇన్‌చార్జీల సమావేశానికి హాజరవుతారు. సాయంత్రం ఐదుగంటలకు విజయవాడ నగర, ఎన్టీఆర్‌ జిల్లా పురప్రముఖులతో వెన్యూ ఫంక్షన్‌హాల్‌లో సమావేశమవుతారు. రాత్రి బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై పార్టీ భవిష్యత్‌ వ్యూహాలపై చర్చిస్తారు.

రాత్రికి విజయవాడలోనే బసచేసి, మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకుని రాజమహేంద్రవరం వెళతారు. అక్కడ కేంద్ర పభుత్వ పథకాల లబ్ధిదారులతో సమావేశమవుతారు. సాయంత్రం బహిరంగసభలో పాల్గొని ఢిల్లీ వెళతారు. నడ్డా రాష్ట్ర పర్యటన విషయాలపై పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్‌రెడ్డి, సూర్యనారాయణ విలేకరుల సమావేశంలో వివరించారు. జనసేనతో పొత్తుపై ఎలా వెళ్లాలనేది తమ పార్టీ జాతీయ నాయకులు నిర్ణయిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి విలేకరులతో చెప్పారు.   

మరిన్ని వార్తలు