సీఎం జగన్‌పై సజ్జన్‌ జిందాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

15 Feb, 2023 13:47 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: మహానేత వైఎస్సార్‌ తనకు మంచి మిత్రులు, గురువు అని జేఎస్‌డబ్ల్యు ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ అన్నారు. బుధవారం ఆయన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో స్టీల్‌ప్లాంట్‌ భూమిపూజ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం జగన్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉందన్నారు. మహానేత వైఎస్సార్‌ చూపిన బాటలోనే సీఎం జగన్‌ నడుస్తున్నారని అన్నారు.

‘‘రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ స్టీల్‌ ప్లాంట్‌ కడప ప్రజల చిరకాల స్వప్నం. వైఎస్‌ జగన్‌ కృషి, పట్టుదల కారణంగానే ఈ కల సాకారమవుతోంది. ఇది వైఎస్సార్‌ జిల్లా. మహానేత వైఎస్సార్‌ని స్మరించుకోకుంటే ఈ కార్యక్రమం అసంపూర్తిగానే మిగిలిపోతుంది’’ అని సజ్జన్‌ జిందాల్‌ వ్యాఖ్యానించారు.

‘‘నేను వైఎస్సార్‌ను కలిసినప్పుడు వైఎస్‌ జగన్‌ యువకుడు. ఆయన్ను ముంబై తీసుకెళ్లి వ్యాపార సూత్రాలు నేర్పించాలని వైఎస్సార్‌ చెప్పారు. 15-17 ఏళ్ల క్రితం జగన్‌ ముంబైలోని నా ఆఫీస్‌కు కూడా వచ్చారు. ఏపీని సీఎం జగన్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రజా సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా జగన్‌ భావిస్తున్నారు. విజయవాడలో సీఎంతో కలిసి లంచ్‌ చేసినప్పుడు రాష్ట్రం గురించి చాలా మాట్లాడుకున్నాం.

వైద్య ఆరోగ్య రంగం నుంచి డిజిటలైజేషన్‌ వరకూ ఆయన మాటలు నాకు దేవుడి మాటల్లా అనిపించాయి. నాకు తెలుగు మాట్లాడటం రాదు.. లేదంటే.. నేను చెప్పే విషయాలు మీకు పూర్తిగా అర్థమయ్యేవి. సీఎం జగన్‌ లాంటి యంగ్‌ అండ్‌ డైనమిక్‌ లీడర్‌ ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది’’అని సజ్జన్‌ జిందాల్‌ పేర్కొన్నారు.
చదవండి: దేవుడి దయతో మంచిరోజులొచ్చాయ్‌: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు