అసైన్డ్‌దారులే అంగీకరించినప్పుడు  మీకొచ్చిన ఇబ్బందేమిటి?

25 Feb, 2022 05:41 IST|Sakshi

అసలు ఈ వ్యాజ్యాన్ని ఎందుకు విచారించాలి?

పిటిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. భూ సమీకరణపై తీర్పు వాయిదా

సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకం కోసం ప్రభుత్వానికి భూములిచ్చేందుకు అసైన్డ్‌దారులే అంగీకారం తెలిపినప్పుడు మీకొచ్చిన ఇబ్బంది ఏమిటని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అసైన్డ్‌దారులు అంగీకరించినప్పుడు భూ సమీకరణను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఎందుకు విచారించాలని కూడా ప్రశ్నించింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల సమీకరణను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తీర్పును వాయిదా వేసింది.  

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి మండలాల పరిధిలో పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా 6,116 ఎకరాలు సమీకరిస్తోందంటూ రైతు కూలీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీరామ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై 2020లో విచారణ జరిపిన సీజే ధర్మాసనం భూములను స్వాధీనం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం తుది విచారణ జరిపింది.

ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 1.5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ భూములతో పాటు అసైన్డ్‌ భూములను కూడా ప్రభుత్వం సమీకరిస్తోందని తెలిపారు. అసైన్డ్‌ భూములు ఇచ్చేందుకు అసైన్డ్‌దారులు లిఖితపూర్వకంగా సమ్మతి తెలియజేశారంటూ వాటిని ధర్మాసనం ముందుంచారు.

అసైన్డ్‌దారులే వ్యవసాయ కూలీలని, అందువల్ల భూ సమీకరణ వల్ల ప్రత్యేకంగా వ్యవసాయ కూలీలు ప్రభావితం కావడం లేదని చెప్పారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోర్టును కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా భూ సమీకరణ చేస్తున్నారని తెలిపారు. అసైన్డ్‌ భూముల సమీకరణకు చట్టం నిర్దేశించిన విధి విధానాలను ప్రభుత్వం అనుసరించలేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు