న్యాయ రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలి..

17 Dec, 2021 04:52 IST|Sakshi
ఆత్మగౌరవ సభలో అభివాదం చేస్తున్న రాయలసీమ విద్యార్థి సంఘం నేతలు తదితరులు

రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ డిమాండ్‌  

సీమ పట్ల చంద్రబాబు తీరు బాధాకరం 

తీరు మార్చుకోకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తాం 

రాయలసీమ ఆత్మగౌరవ సభలో నేతల హెచ్చరిక

కర్నూలు సిటీ: న్యాయ రాజధానిని, కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. కర్నూలులోని ప్రభుత్వ జూనియర్‌(టౌన్‌ మోడల్‌) కళాశాల ఆవరణలో గురువారం రాయలసీమ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. సభలో రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులు సునీల్‌కుమార్‌రెడ్డి, శ్రీరాములు, చంద్రప్ప, రామకృష్ణ, రాయలసీమ మేధావుల ఫోరం నేత చంద్రశేఖర్, విద్యావేత్త డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాయలసీమ అభివృద్ధిపై తమ వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కొందరు రాయలసీమ నేతలు అమరావతి రియల్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఆ ప్రాంతానికి చెందిన రియల్టర్లు రైతుల ముసుగులో చేపట్టిన పాదయాత్రకు.. విరాళాలివ్వడం దారుణమన్నారు. ఇలాంటి నేతలకు చీర, సారెలు పంపిస్తామని ఎద్దేవా చేశారు.

సీమ పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని, తీరు మార్చుకోకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అమరావతి రైతుల ముసుగులోని ఆర్టిస్టులు రాయలసీమలోకి వచ్చాక తిరుపతిలో ఫ్లెక్సీలు చింపివేయడాన్ని బట్టి చూస్తే.. వారెంత అరాచకవాదులో అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు రాజునాయుడు, రామచంద్రుడు, ఓబులేసు, సూర్య, మహేంద్ర, నరసన్న, నాగరాజు, శివ, ముక్తార్, వెంకటేష్, రామరాజు, రియాజ్, బన్నీ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు