నిమ్మాడ ఘటనలో అచ్చెన్నాయుడు అరెస్ట్‌

3 Feb, 2021 07:51 IST|Sakshi

14 రోజుల రిమాండ్‌..  

జిల్లా జైలుకు తరలింపు 

టీడీపీ శ్రేణులు అడ్డుకునే యత్నం  

నియంత్రించిన పోలీసులు

సాక్షి, టెక్కలి‌: తన సొంత గ్రామం నిమ్మాడలో గత నెల 31వ తేదీ ఆదివారం నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన కింజరాపు అప్పన్న, ఆయనకు మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ తదితరులపై జరిగిన దౌర్జన్యకాండకు ప్రధాన సూత్రధారి అయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్యతో పాటు పోలీస్‌ బలగాలు నిమ్మాడలో ఆయన ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం కోటబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి సంఘటనకు సంబంధించి రికార్డులను సిద్ధం చేసి కోటబొమ్మాళి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు తరలించారు.

ఈ క్రమంలో కొత్తపేట జంక్షన్‌ వద్దకు చేరుకున్న టీడీపీ శ్రేణులు అచ్చెన్నాయుడు ఉన్న పోలీస్‌ వాహనాన్ని అడ్డుకున్నాయి. దీంతో పోలీస్‌ ప్రత్యేక బలగాలు రంగ ప్రవేశం చేసి వారిని నియంత్రించాయి. అనంతరం కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రిలో ఆయనకు కోవిడ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కోర్టు వద్దకు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని అదుపు చేశారు. కోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత అచ్చెన్నాయుడుకు 14 రోజులు రిమాండ్‌ విధించగా, మధ్యాహ్నం 3.40 గంటలకు ఆయన్ను జిల్లా జైలుకు తరలించారు.  

ఎందుకు ఈ కేసు అంటే.. 
►నిమ్మాడలో కింజరాపు అప్పన్న సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేయడం అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్‌లకు ఇష్టం లేదు.  
►అచ్చెన్నాయుడు గత నెల 30వ తేదీన అప్పన్నకు ఫోన్‌ చేశారు. ‘అందరం ఒకే దగ్గర ఉంటున్నాం. గతంలో నీకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. నీ భార్యను ఉద్యోగం నుంచి తీసేయించారన్న విషయం కూడా నాకు తెలుసు. మా అన్నయ్య నోట్‌ పేపర్‌ తీసుకొన్న విషయం మాత్రం తెలియదు. అవన్నీ సరే. నువ్వు నష్టపోయావని కూడా తెలుసు. అయినా సరే ఇప్పుడు మాత్రం నువ్వు పోటీ చేయొద్దు. అదేం రాష్ట్రపతి పదవి కాదు’ అని తనదైన శైలిలో చెప్పారు. ‘ఉద్యోగం తీసేయించారు.. మీ వద్దకు 20 సార్లు వచ్చినా పట్టించుకోలేదు..’ అని బాధితుడు చెప్పిన దానికి అవునంటూనే ఎన్నికల్లో పోటీ చేయొద్దని బెదిరించారు.  
►తనకు జరిగిన అన్యాయం పట్ల తీవ్రంగా కలత చెందిన అప్పన్న.. పంచాయతీ సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేయడానికే సిద్ధపడ్డారు.  
►ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పినా వినకుండా అప్పన్న నామినేషన్‌ వేయడానికి వెళ్తున్నాడనే సమాచారం తెలుసుకున్న అచ్చెన్నాయుడు.. అతన్ని ఎలాగైనా సరే ఆపండని గత నెల 31న తన సోదరుడిని పురమాయించారు. దీంతో హరిప్రసాద్, సురేష్, టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై బాధితుడు అప్పన్న కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
►ఈ మేరకు క్రైమ్‌ నంబర్‌ 44/2021 ప్రకారం 147, 148, 307, 324, 506, 341, 384, 188 రెడ్‌ విత్‌ 149, ఐపీసీ సెక్షన్‌ 123 ఆఫ్‌ ది పీపుల్‌ రిప్రజెంట్‌ చట్టం, సెక్షన్‌ 212 ఆఫ్‌ ది ఏపీ పంచాయతీ రాజ్‌ చట్టం–1995 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితులు కింజరాపు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

22 మందిపై కేసు నమోదు
సాక్షి, విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో నామినేషన్‌ వేయకుండా అడ్డుకుని, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో 22 మందిపై కేసు నమోదు చేశామని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌.కె.వి రంగారావు తెలిపారు. మంగళవారం ఆయన విశాఖ డీఐజీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటేనని, శాంతి, సామరస్య ధోరణిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడడం పోలీసులుగా తమ బాధ్యత అన్నారు. ఎన్నికలకు ఆటంకం కలిగించే వారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని 
హెచ్చరించారు. 

నేను హోంమినిష్టర్‌ అవుతా.. మిమ్మల్ని విడిచిపెట్టను
‘రేపు అధికారంలోకి మేమే వస్తాం.. చంద్రబాబునాయుడుకు చెప్పి నేను హోమ్‌ మినిష్టర్‌ పదవి తీసుకుంటాను.. మీరు ఎక్కడ ఉన్నా విడిచిపెట్టను’ అని కోటబొమ్మాళి ఆస్పత్రి వద్ద కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, సీఐ ఆర్‌.నీలయ్య, పోలీసులను అచ్చెన్నాయుడు బెదిరించారు.  

మరిన్ని వార్తలు