ప్రశాంతంగా జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్షలు

4 Oct, 2021 04:25 IST|Sakshi
నున్నలోని పరీక్ష కేంద్రంలో హైకోర్టు జడ్జి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్, జిల్లా జడ్జి రామకృష్ణ తదితరులు

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తులు 

పెదగంట్యాడ (గాజువాక)/విజయవాడ రూరల్‌/గుంటూరు రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్‌ సివిల్‌ జడ్జి రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గాజువాకలోని బీసీ రోడ్డులో ఉన్న ఎస్‌వీఎస్‌ టెక్నాలజీ అండ్‌ సొల్యూషన్స్‌లో మొత్తం 140 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 110 మంది హాజరయ్యారు. 30 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష కేంద్రాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ పరిశీలించి, అక్కడి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో ఉన్న వికాస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ పరిశీలించారు.
పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి వెళ్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు తదితరులు   

ఆయనతో పాటు జిల్లా జడ్జి జి.రామకృష్ణ ఉన్నారు. ఈ కేంద్రంలో మొత్తం 50 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 39 మంది మాత్రమే పరీక్ష రాశారని వికాస్‌ కళాశాలల చైర్మన్‌ నరెడ్ల నర్సిరెడ్డి తెలిపారు. అలాగే, గుంటూరు రూరల్‌ మండలం చల్లావారిపాలెంలోని బాలాజీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బి బ్లాక్‌లో, వట్టిచెరుకూరు మండలం మలినేని ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు పరిశీలించారు. ఆయన వెంట రిజిస్ట్రార్‌ ఆలపాటి గిరిధర్, జిల్లా జడ్జి రవీంద్రబాబు ఉన్నారు.   

మరిన్ని వార్తలు