కోడలికి అత్తింటి నుంచి జీవనభృతి 

16 Feb, 2022 04:15 IST|Sakshi

మహిళా కమిషన్‌ చొరవతో దక్కిన న్యాయం 

సాక్షి, అమరావతి: భర్తను కోల్పోయి, అత్తింటి నుంచి ఆదరణ కరువైన మహిళకు చివరకు రాష్ట్ర మహిళా కమిషన్‌ జోక్యంతో న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కలకట మండలం కె.బాటవారిపల్లెకు చెందిన రెడ్డి జాహ్నవికి 2020లో వివాహమైంది. ఆమె భర్త గతేడాది కోవిడ్‌తో చనిపోయాడు. అప్పట్నుంచి ఆమె పోషణ విషయంలో అత్తింటి నుంచి పేచీలు, వేధింపులు తప్పలేదు. దిక్కుతోచని స్థితిలో జాహ్నవి చివరికి రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది.  

కమిషన్‌ సభ్యురాలు గజ్జల వెంకటలక్ష్మికి కేసు విచారణ బాధ్యతలు అప్పగిస్తూ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆదేశాలిచ్చారు. దీంతో ఇరుపక్షాలను కమిషన్‌ కార్యాలయానికి పిలిపించి విచారించారు. చట్టపరమైన హక్కులతో జాహ్నవికి జరగాల్సిన న్యాయంపై అత్తింటి వారిని ఒప్పించారు. దీంతో అత్తవారింటి నుంచి తన జీవనభృతికి సంబంధించి రావాల్సిన మొత్తాన్ని చెక్కు రూపంలో జాహ్నవికి కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. 

మరిన్ని వార్తలు