న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం ఎక్కడ? 

14 Apr, 2022 05:35 IST|Sakshi
మాట్లాడుతున్న జస్టిస్‌ బట్టు దేవానంద్‌

సామాజికన్యాయం నేతిబీర చందమే 

1,104 మంది జడ్జిల్లో ఎస్సీలు 16 మంది, ఎస్టీలు 8 మంది 

16 కోర్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యమే లేదు 

అంబేడ్కర్‌ను ఓ కుల నాయకుడిగా చిత్రీకరించడం దారుణం 

అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల్లో జస్టిస్‌ బట్టు దేవానంద్‌  

సాక్షి, అమరావతి: న్యాయవ్యవస్థలో సామాజిక న్యాయం అమలు కావడం లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, బలహీనవర్గాలకు చెందిన న్యాయవాదుల విషయంలో సామాజిక న్యాయం నేతిబీర చందంగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో 1,104 మంది జడ్జిలు ఉంటే, అందులో కేవలం 92 మంది మహిళా న్యాయమూర్తులే ఉన్నారని చెప్పారు. అలాగే 16 మంది ఎస్సీ, ఎనిమిది మంది ఎస్టీ జడ్జీలు మాత్రమే ఉన్నారని తెలిపారు. 16 హైకోర్టుల్లో అసలు ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యమే లేదన్నారు. ఈ గణాంకాలు సామాజిక న్యాయం అమలు తీరుకు ప్రతిబింబమని చెప్పారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైకోర్టులో జరిగిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు.

అపర మేధావి, అభ్యుదయవాది, రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను ఓ కుల నాయకుడిగా చిత్రీకరించడం దారుణమని చెప్పారు. అంబేడ్కర్‌ తన జీవితాన్ని సామాజికన్యాయం కోసం ధారపోశారన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటికీ దేశంలో సామాజికన్యాయం అమలు కావడం లేదని చెప్పారు. మనదేశం కులవ్యవస్థకు ప్రాధాన్యతనిస్తోందని, అందుకే అంబేడ్కర్‌ను ఓ కులానికి నాయకుడిగా చూపుతున్నారని తెలిపారు. అంతకుముందు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా మాట్లాడుతూ అంబేడ్కర్‌ వ్యక్తిత్వాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

ఆయన భావజాలాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలని పిలుపునిచ్చారు. జస్టిస్‌ శేషసాయి మాట్లాడుతూ అంబేడ్కర్‌ది మహోన్నత వ్యక్తిత్వమని చెప్పారు. అంబేడ్కర్‌ మార్గాన్ని అందరూ అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. జస్టిస్‌ గంగారావు మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమేనంటూ, అందరి హక్కుల పరిరక్షణకు అంబేడ్కర్‌ ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.జానకిరామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనపల్లి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు