సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ భూయాన్, జస్టిస్‌ ఎస్‌వీ భట్టి

6 Jul, 2023 06:09 IST|Sakshi
జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ ఎస్‌. వెంకటనారాయణ భట్టి

తెలంగాణ, కేరళ హైకోర్టుల సీజేలను సిఫార్సు చేసిన కొలీజియం 

ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ భట్టి 

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ప్రస్తుతం కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ ఎస్‌.వెంకటనారాయణ భట్టిలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

సుప్రీంకోర్టులో మూడు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సి ఉండడంతో కొలీజియం ఇటీవల సమావేశమైంది. కేరళ సీజే ఎస్‌.వెంకటనారాయణ భట్టి, తెలంగాణ సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ పేర్లను కొలీజియం ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్లు సుప్రీంకోర్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా సీనియారిటీ, మెరిట్, పనితీరు వంటి అంశాలతోపాటు హైకోర్టుల ప్రాతినిధ్యం, అట్టడుగు వర్గాలు, సమాజంలో వెనకబడిన వర్గాలు, లింగ వైవిధ్యం, మైనారిటీల ప్రాతినిధ్యం వంటివి మూల్యాంకనం చేసి ఈ ఇద్దరు న్యాయమూర్తులను సిఫార్సు చేసినట్లు పేర్కొంది.

2022 ఆగస్టు నుంచి సుప్రీంకోర్టులో ఏపీకి ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో మాతృ హైకోర్టు అయిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తుల్లో సీనియర్‌ అయిన జస్టిస్‌ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. 

సమగ్రత, సామర్థ్యం ఉన్న న్యాయమూర్తి భుయాన్‌ 
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ చట్టంలోని విభిన్న అంశాలపై అనుభవం సంపాదించారని సుప్రీంకోర్టు కొలీజియం పేర్కొంది. లా ఆఫ్‌ టాక్సేషన్‌లో ఆయన ఎంతో నైపుణ్యం ఉన్నవారని తెలిపింది. బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో ట్యాక్సేషన్‌ సహా పలు కేసులు సమర్థంగా డీల్‌ చేసిన ఆయన సమగ్రత, సామర్థ్యం ఉన్న న్యాయమూర్తి అని పేర్కొంది. జస్టిస్‌ భుయాన్‌ 2011 అక్టోబరు 17న గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

జస్టిస్‌ భట్టి అనుభవం అపారం 
ఏపీ, కేరళ హైకోర్టుల్లో సుదీర్ఘకాలం పనిచేసిన జస్టిస్‌ భట్టి చట్టంలోని పలు అంశాలపై అపార అనుభవం సంపాదించారని సుప్రీంకోర్టు కొలీజియం పేర్కొంది. జస్టిస్‌ భట్టి తీర్పులే ఆయన న్యాయపరమైన యోగ్యతకు నిదర్శనమని తెలిపింది. జస్టిస్‌ భట్టి జ్ఞానం, అనుభవం సుప్రీంకోర్టుకు అదనపు విలువ అందిస్తాయని పేర్కొంది. జస్టిస్‌ ఎస్‌.వి.భట్టి 1962 మే 6న చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు.

తల్లిదండ్రులు రామకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ. మదనపల్లెలోని గిరిరావు థియోసోఫికల్‌ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన బీసెంట్‌ థియోసాఫికల్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. బెంగళూరులోని జగద్గురు రేణుకాచార్య కాలేజీ నుంచి లా డిగ్రీ పొంది, 1987లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఇ.కళ్యాణ్‌రామ్‌ వద్ద న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, బీహెచ్‌ఈఎల్, బీఈఎల్, బీహెచ్‌పీవీ, ఆర్‌ఎస్‌వీపీ, నేషనల్‌ మారిటైం యూనివర్సిటీలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2000 నుంచి 2003 వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా అప్పటి అడ్వొకేట్‌ జనరల్‌కు సహాయ సహకారాలు అందించారు. 2013 ఏప్రిల్‌ 12న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

2014లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా 2019లో ప్రమాణం చేశారు. అదే ఏడాది జస్టిస్‌ భట్టిని కేరళ హైకోర్టుకు బదిలీ చేస్తూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్, న్యాయమూర్తులు జస్టిస్‌ సిక్రీ, జస్టిస్‌ బాబ్డే, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ అరుణమిశ్రాలతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌ 24న కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, జూన్‌ 1న పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.   

మరిన్ని వార్తలు