ధిక్కార కేసులో కోర్టుకు హాజరైన ముత్యాలరాజు

30 Dec, 2022 05:10 IST|Sakshi

హైకోర్టు ఆదేశాల అమలులో జాప్యంపై ప్రశ్నించిన జస్టిస్‌ దేవానంద్‌

సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో పశ్చిమ గోదావరి జిల్లా అప్పటి కలెక్టర్, ప్రస్తుతం ముఖ్య­మంత్రి అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు గురువారం వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజర­య్యా­రు. అప్పటి నిడదవోలు తహసీల్దార్‌ శాస్త్రి, పంచాయతీరాజ్‌ సబ్‌ డివిజనల్‌ ఆఫీసర్‌ గంగరాజు కూడా కోర్టు ముందు హాజరయ్యారు.

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల భవనం ఆక్రమణలను తొలగించి, పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మించాలన్న తమ ఆదేశాల అమలులో ఎందుకు జాప్యం జరిగిందని న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ప్రశ్నించారు. అప్పట్లో అధికారులందరూ కోవిడ్‌ విధుల్లో తీరిక­లేకుండా ఉన్నారని, దీంతో కోర్టు ఆదేశాల అమలు­లో జాప్యం జరిగిందని ముత్యాలరాజు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్‌రెడ్డి కోర్టుకు నివేదించారు.

జాప్యం ఉద్దేశపూర్వకం కాదని చెప్పారు. ఇందుకు బేషరతు­గా క్షమాపణ చెబుతున్నామన్నారు. ఇప్పటికే సర్వే­చేసి ఆక్రమణలను తొలగించామన్నారు. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అధికారులకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు.  

మరిన్ని వార్తలు